29-09-2025 12:00:00 AM
-అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల
-అనుమతి లేనిదే మాజీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలోకి ప్రవేశం లేదని స్పష్టీకరణ
-ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో ముఖాముఖి విచారణ జరగనునన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఒక బులెటిన్ విడుదల చేశారు. అనుమతి లేనిదే అసెంబ్లీలోకి ఎవరూ రావొద్దని.. సందర్శకులు, మీడియాతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు ఆంక్షలు విధించారు.
ముందస్తు అనుమతి ఉంటేనే అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించొచ్చని, మీడియా పాయింట్ వద్ద కూడా ఎవరూ మాట్లాడొద్దని నిబంధనలు విధించారు. ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే సభ్యులు (పిటిషనర్లు, రిస్పాండెంట్లు), వారి న్యాయవాదులు కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. ఎవరైనా మొబైల్‌లో రికార్డింగ్ లేదా ఫొటోలు, వీడియోలు తీస్తే, ఆ ఫోన్ స్వాధీనం చేసుకొని, ఆ న్యాయవాది కోర్టులో వాదన వినిపించే అవకాశం కోల్పోతారని రాష్ర్ట శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయని పేర్కొన్నారు.
నేటి విచారణ షెడ్యూల్ ఇలా..
సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై, మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 1గంటకు గూడెం మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించనున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్ల మధ్య వాదనలు జరగనున్నాయి. పార్టీ ఫిరాయిం పుల పిటిషన్ల విషయంలో స్పీకర్‌కు సుప్రీంకోర్టు విధించిన గడువు వచ్చే నెల 30తో ముగియనుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ పార్టీ ఫిరాయింపు నోటీసులు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి తమ వివరణలను అఫిడవిట్ రూపంలో అందజేశారు.