calender_icon.png 25 October, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ

25-10-2025 12:06:57 AM

స్పీకర్ సమక్షంలో వాదనలు వినిపించిన ఇరు వర్గాల న్యాయవాదులు 

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమక్షంలో శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సమయంలో అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మొదటగా రాజేందర్‌గనర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి.ప్రకాశ్ గౌడ్, మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య, మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించారు. ప్రతి కేసులో ఇరువర్గాలు స్పీకర్ ముందు వాదనలు వినిపించారు.

ఇప్పటికే ఇరువర్గాలు తమ ఆధారాలు, అఫిడవిట్లు స్పీకర్‌కు సమర్పించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పిటిషన్‌దారుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించగా, తమ నియోజక వర్గాల అభివృద్ది కోసం సీఎంను కలిస్తే తప్పేంటీ..? అని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.