calender_icon.png 19 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత

19-08-2025 02:04:58 AM

నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త మరువక ముందే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి (75) సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కోట దంపతులకు ముగ్గురు సంతానం.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు ఆంజనేయప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘సిద్ధం’, ‘గాయం 2’ వంటి చిత్రాల్లో ప్రసాద్ నటించారు.

ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కోట దంపతులు బాగా కుంగిపోయారు. కోట శ్రీనివాసరావుకు ఓర్పు చాలా ఎక్కువ అని.. అందరితో సరదాగా ఉంటారని రుక్మిణి పలు సందర్భాల్లో చెప్పారు. తన భర్త నటించిన చిత్రాల్లో ‘అహనా పెళ్ళంట’ సినిమా అన్నా, అందులో ఆయన నటించిన పిసినారి పాత్ర అన్నా బాగా నచ్చుతాయని ఆమె చెబుతుండేవారు.

ఇక కోట.. తాను సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేకపోయానని అనేక సందర్భాల్లో చెప్పారు. తమ పిల్లలను మంచి చదువులు చదివించే బాధ్యత తన భార్యే చూసుకుందని అంటుండేవారు. జూలై 13న కోట శ్రీనివాస్ మరణించారు. నెలన్నర రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. కోట దంపతుల మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.