19-08-2025 02:06:19 AM
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది రష్మిక మందన్న. అందం, అభినయంతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హారర్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక నటిస్తున్న ‘థామా’ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీటీమ్ సోమవారం ప్రకటించింది. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
కీలక పాత్రలు, వారి పేర్లను పరిచయం చేస్తూ పోస్టర్లను పంచుకుంది. ఆయుష్మాన్ ఖురానా పాత్ర పేరును ‘అలోక్’గా పరిచయం చేసిన టీమ్ రష్మిక ‘తడకా’ పాత్ర పోషిస్తోందని పేర్కొంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ యక్షసాన్‌గా, పరేశ్ రావల్ రామ్ బజాజ్ గోయెల్‌గా కనిపించ నున్నారు. మాడ్‌డాక్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. కొన్ని అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ ఇందులో ప్రేమే ముఖ్య కథాంశమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేయనుంది.