29-08-2025 05:32:34 AM
మునుపెల్లి వాగులో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపర్లు
12 గంటలు కష్టపడి రక్షించిన జిల్లా యంత్రాంగం
నిర్మల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహించాయి. కుంటాల రోడ్డు తెగిపోయింది. సారంగాపూర్ ప్రధాన రోడ్డు కొట్టుకపోవ డంతో రాకపోకలు నిలిచిపోయి. మురళి ఎక్స్‌రోడ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు. వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదల వల్ల వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది.
నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ, రాంనగర్ సోఫీ నగర్, జిఎన్‌ఆర్ కాలనీలకు వరద రావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్యే బొజ్టుపటేల్ స్థానికంగా ఉండి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
లక్ష్మణ చందా మండలం మునుపెల్లి వాగు ఉన్న మైదానంలో బుధవారం పశువులు మేపడానికి ముగ్గురు కాపర్లు బుధవారం వెళ్లారు. పశువులు మేపుతుండగా ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు 39 ఎత్తివేయడంతో వరద నీరు ఉధృతి పెరిగి, అవతలి వైపు పశువుల కాపరులు తలదాచుకున్నారు. ఇవతలి వైపు తెచ్చేందుకు ఎన్డిఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేసినప్పటికీ వరద కారణంగా వీలుపడలేదు.
కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.. గోదావరి నది ఒడ్డున ఉండి వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు ఆరా తీశారు. డ్రోన్లతో ఆహారం, సమాచారం కోసం సెల్‌ఫోన్‌ల ను పంపించారు. బుధవారం రాత్రి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక బోట్లు ఉపయోగించి గురువారం ఉదయం సురక్షితంగా మునిపల్లి వాగు దాటించారు.
మంచిర్యాలవాసుల ఆందోళన
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్ర్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్40 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలడంతో మంచిర్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన రామ్‌నగర్, ఎన్టీఆర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. మంచిర్యాలలోని ఎంసీహెచ్ చుట్టూ వరద నీరు చేరడంతో రోగులను, సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్‌టిఆర్ కాలనీవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.