02-12-2025 02:29:01 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, డిసెంబర్:1గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 రెండో విడత నామినేషన్ స్వీకరణను జిల్లా కలెక్టర్ కె.హైమావతి సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నంగునూరు మండలంలోని పాలమాకుల, బద్దిపడగ క్లస్టర్లను సందర్శించి నామినేషన్ స్వీకరణ నిర్వహణ ఏర్పాట్ల గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
పాలమాకుల క్లస్టర్కు చెందిన పాలమాకుల, రాజ్గోపాల్పేట, ముండ్రాయి గ్రామాలు, బద్దిపడగ క్లస్టర్కు చెందిన బద్దిపడగ, జెపి తండా, దర్గపల్లి గ్రామాల నామినేషన్ స్వీకరణ కొనసాగుతోందని అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ , ఎన్నికల రెండో దశలో అక్బర్పేట భూంపల్లి, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, బెజ్జంకి మండలాల్లో మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 58 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి క్లస్టర్లో నామినీ అభ్యర్థులకు సాయం అందించేందుకు హెల్ప్డెస్కులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్వోలు నామినీ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే స్లిప్ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ నామినేషన్ పత్రాలను టీ పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. క్లస్టర్ చుట్టూ 100 మీటర్ల పరిధిలో నామినీతో పాటు ఇద్దరికి మాత్రమే ప్రవేశం కల్పించాలని, 144 సెక్షన్ అమల్లో ఉండడంతో కఠిన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.