calender_icon.png 2 December, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్ట్‌తో దోపిడీ

02-12-2025 01:01:40 AM

-కారుచౌకగా విలువైన భూములు 

-ఆ పాలసీని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలి 

-రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిటీవేయాలి

- గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ

-7న మహాధర్నా

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అత్యంత విలువైన 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పాలసీ నెం.27)ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర గవ ర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ కోరింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ నాయకుల బృందం గవర్నర్‌ను సోమవారం కలిసి ఫిర్యాదు చేసింది.

ఈ పాలసీ ప్రకారం ఓఆర్‌ఆర్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లోని 9,292 ఎకరాల భూమి మల్టీ-పర్పస్ యూజ్‌కి మార్చబడుతుందని, దాంతో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఫిర్యాదులో బీజే పీ పేర్కొంది. మార్కెట్ విలువకు తక్కువగా 30 శాతం నుంచి 50 ఎస్‌ఆర్ రేట్లే విధించడంతో ప్రైవేట్ రియల్టర్స్ నెట్‌వర్క్‌కు భూములు తక్కువ ధరలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఇది అతిపెద్ద కుంభకోణానికి తెరదీసే ప్రక్రియనేనని తెలిపింది. 50 నుంచి 60 సంవత్సరాల క్రితం స్థాపించబడిన అనేక పరిశ్రమలు వివిధ కారణాలతో మూసివేయబడ్డాయని, కొన్ని పరిశ్రమలు కాలుష్య కారకాల కేటగిరీలోకి వస్తాయని, 2013 జీవో నెం. 20 ప్రకారం వాటిని తరలించాల్సి ఉంటుందని ప్రభుత్వం కారణాలను చెబుతోందని ఫిర్యాదులో తెలిపింది.

ఈ కార ణాలు సరైనవేనని అనిపించినా, నిశితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వ విధానం ఉందని పేర్కొంది. ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు ప్రభుత్వ సంపదను ప్రైవేట్ చేతుల్లోకి బదిలీ చేయడానికి కుట్ర పన్నారనే అనుమానం ఉందని తెలిపింది. దీని విలువ రూ.5 లక్షల కోట్లకుపైగా ఉంటుందని పే ర్కొంది.

ఎస్‌ఆర్‌వో రేట్లలో 30 శాతం మాత్రమే చెల్లించి భూములను కన్వర్ట్ చేసుకునే విధానం వేల కోట్ల రూపాయల ప్రజా సంపదను కోల్పోయేలా చేస్తోందని తెలిపింది. ఈ పాలసీ వల్ల వేలాది మంది కార్మి కులు ఉపాధి కోల్పోవడంతో పాటు, రైతులకు తీవ్ర నష్టం జరిగే తీవ్రమైన పరిణా మాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. 

పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రపు ధరలకు భూములను కేటాయిం చిందని తెలిపింది. గత దశాబ్దకాలంలో హైదరాబాద్ అంతటా భూమి ధరలు బాగా పెరిగినప్పటికీ అతి తక్కువ ధరలకు వాటిని ప్రభుత్వం ధారాదత్తం చేయాలని చూస్తోందని బీజేపీ విమర్శించింది.

  ఉదాహరణకు నాలుగు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ వేలంలో ఒక ఎకరం భూమి రూ.151 కోట్ల కు అమ్ముడైందని, ప్రస్తుత మార్కెట్ ప్ర కారం ఈ ప్రాంతాల్లోని పారిశ్రామిక భూ ముల విలువ ఎకరానికి సుమారు. రూ.65 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 9,292 ఎకరాలను మార్కెట్ రేటుకు కట్టబెడితే అది రూ.6 లక్షల కోట్లు పైగా ఉంటుందని ఫిర్యాదులో తెలిపింది.

ఇలా కాకుండా ఎస్‌ఆర్ విలువలో కేవలం 30 శాతం రేట్లతో ప్రైవేట్ వ్య క్తులకు మార్పిడి చేయడంతో ప్రైవేట్ రియల్టర్లకు ప్రభుత్వం తక్కువ ధరలకు విలువైన భూమిని ఇచ్చినట్లవుతుందని, ఇది దోపిడీ చేయడమేనని తెలిపింది. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బీజేపీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, జీహెచ్‌ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఫిర్యాదులోని ప్రధాన డిమాండ్స్..

1.హిల్ట్ పాలసీ కోసం తీసుకొచ్చిన జీవో నెం.27ను రద్దు చేయాలి.

2.హిల్ట్‌పై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలి.

3.ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ పాలసీని పరిశీలించాలి.

4.కాలుష్య కారక పరిశ్రమల స్టేటస్‌ను పరిశీలించాలి.

5.ఆయా పరిశ్రమలలో పనిచేసే కార్మికులపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి.

6.రైతుల చేతిలో ఉన్న వ్యవసాయ భూములు కూడా మల్టీ పర్పస్ కోసం వినియోగించేలా కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వాలి.

7న మహాధర్నా 

-హిల్ట్ పాలసీ, మున్సిపాలిటీల విలీనంపై బీజేపీ పోరు

-బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హిల్ట్ పాలసీ, జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. హిల్ట్ పాలసీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు ఇతర నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాంచందర్ రావు సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా..? పరిపాలన చేస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం ఎలా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల రాష్ర్ట ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్‌కు వివరించామన్నారు. డిసెంబర్ 7వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.