02-12-2025 12:34:19 AM
మోతే, డిసెంబర్ 1 : గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మండల వ్యాప్తంగా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సర్పంచ్, వార్డ్ సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు ఇప్పటికే రంగంలోకి దూకేశారు. గ్రామాలలో ఏ కోణంలో చూసిన రాజకీయ సమావేశాలు, చర్చలు, లెక్కలు, పంచాయతీ ఎన్నికల జోరు స్పష్టంగా కనిపిస్తున్నది.
రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ సపోర్టు దక్కించుకోవడం గెలుపునకు కీలకమని భావిస్తున్న ఆశావహులు బడా నాయకుల తలుపులు తడుతున్నారు. ఒక్కో పార్టీలో ఐదునుంచి ఆరుమంది. పోటీ పడుతుండడంతో స్థానిక నాయకులు సుక్క ముక్క ఏర్పాటు చేస్తూ అనుచరులను కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎలా ఇవ్వాలనే సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ పార్టీ క్యాడర్ దెబ్బతినకుండా అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నుండి టిక్కెట్ ఖరారు చేసే ప్రయత్నంలో ఉంది. కానీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ అనే సీఎం మాటలే గ్రామాలలో చర్చ నీయంశoగా మారాయి.
రిజర్వేషన్ల మార్పులతో బెంబేలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సాధ్యం కాకపోవడంతో పాత విధానానికే తిరిగింది. దీంతో పలు గ్రామాలలో రిజర్వేషన్లు తారు మారయ్యాయి. సామాజిక కార్యక్రమాల పేరుతో ఇప్పటికే లక్షలు ఖర్చు చేసిన రిజర్వేషన్ మారకపోవడంతో ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఏమవుతుందో అన్న ఉత్కంఠ నెలల పాటు కొనసాగి. చివరకు మారిపోవడంతో చాలామంది తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.
ప్రతి పనిలో రాజకీయం
సర్పంచ్ ఓటర్ డ్రాఫ్ట్ సిద్ధం కావడంతో గ్రామాలలో ఎన్నికల చర్చలు భగ్గుమంటున్నాయి. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగిన ఆశావహుల హాజరు తప్పనిసరి. మాట్లాడితే గ్రామాభివృద్ధి, చేతులు కలిపితే మేమున్నాము అన్న సందేశం ఇదే ప్రస్తుతం స్థానిక రాజకీయాల దృశ్యం. ఎవరి బలంఎంత? అనుచరులు ఎంత? గ్రామంలో మద్దతు ఎలా? అన్నదానిపై రోజంతా లెక్కలు వేసుకుంటున్నారు.
పార్టీ సపోర్ట్ కోసం పాత కొత్త నేతల మధ్య ఘర్షణ
దీర్ఘకాలంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, ఇటీవల అధికార పార్టీలో చేరి శ్రమించిన నాయకులు ఇలా ఈ రెండు వర్గాల మధ్య పోటీ మండలంలో చెలరేగుతుంది. లోకల్ నాయకుల సపోర్ట్ కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఆశావహులు నిత్యం క్యాంప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆశీస్సులు ఉంటే గెలుపు ఖాయం అన్న నమ్మకంతో ప్రతి అభ్యర్థి అండ కోసం పరుగులు పెడుతున్నారు.
బిఆర్‌ఎస్ నుంచి కూడా టఫ్ ఫైట్
అధికారంలో లేకపోయినా బి ఆర్ ఎస్ పంచాయతీ ఎన్నికల యుద్ధరంగంలోకి దిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వయంగా గ్రామాలలో పర్యటిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అసంతృప్తి నెలకొనడంతో కొందరు కార్యకర్తలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితిని ప్రతిపక్షం క్యాచ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
నువ్వా- నేనా అన్నట్లుగా జరగనున్న పంచాయతీ పోరు
ఎమ్మెల్యే ప్రయారిటీ, రిజర్వేషన్ గందరగోళం,ఆశావహుల హడావుడి, గ్రామాలలో రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ వేడి, ఇవన్నీ కలగలిపి పంచాయతీ ఎన్నికలు మండలంలో హోరాహోరీగా సాగను న్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీల మధ్య కాదు.. పార్టీ లోపల కూడా నువ్వా.. నేనా? అన్న టఫ్ ఫైట్ తప్పదని రాజకీయ వర్గాల అంచనా వేస్తున్నారు.