calender_icon.png 2 December, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్రావస్థలో మైనింగ్ శాఖ!

02-12-2025 12:06:13 AM

-కార్యాలయంలో కనిపించని అధికారులు

-రెచ్చిపోతున్న ఇసుకమట్టి గ్రానైట్ మాఫియా

-పట్టించుకోని ఉన్నతాధికారులు

నాగర్ కర్నూల్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో మైనింగ్ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజువారీగా కార్యాలయానికి అధికారులు హాజరుకాని పరిస్థితి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. గద్వాల జిల్లా మైనింగ్ శాఖ అధికారి వెంకటరమణకు అదనపు బాధ్యతలను నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయ బాధ్యతలను అప్పగించడంతో అడపాదడపా వచ్చి పోవడంతో కిందిస్థాయి అధికారులు సైతం పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరోపక్క జిల్లా వ్యాప్తంగా చెరువులు,  కుంటలు, గుట్టలు ధ్వంసం చేసి మట్టి దందా, దుందుభి పరివాహక ప్రాంత గ్రామాల మీదుగా అక్రమంగా ఇసుకను తరలించి ఇసుక మాఫియా కోట్ల రూపాయలు పోే్గస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. అనుమతులు పొందిన మైనింగ్ క్వారీలు కూడా రాయల్టీ చెల్లింపుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా  ప్రభుత్వానికి గండి కొడుతున్నా మైనింగ్ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచుల నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుకను తోడేందుకు అడ్డంకులు ఉన్నాయని చెప్తూనే అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సమీప గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి దందా, ఇసుక దందా గ్రానైట్ దందా చేస్తున్న వారి నుంచి భారీ ఎత్తున సంబంధిత శాఖ అధికారులు  ముడుపులు అందుకని అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నిత్యం ఫీల్ విజిట్ పేరుతో కార్యాలయానికి దుమ్మా కొట్టి ఇంటికే పరిమితం అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సోమవారం కార్యాలయాన్ని సందర్శించగా జిల్లా మైనింగ్ శాఖ అధికారి, రాయల్టీ ఇన్స్పెక్టర్ అధికారి కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే దుందుభి నది తీర ప్రాంతాల్లో భారీ వాహనాలు యంత్రాల సహాయంతో పగలు,  రాత్రిళ్ళు అక్రమంగా ఇసుకను తవ్వకాలు జరిపి రాత్రిళ్ళు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

మాఫియా ఆగడాలు ప్రాంతాల వారీగా విస్తరిస్తుండగా, మైనింగ్ శాఖ పరిశీలన, పర్యవేక్షణ పూర్తిగా కనిపించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మైనింగ్ శాఖ అధికారి వెంకటరమణను వివరణ కోరెందుకు కార్యాలయానికి వెళ్లినా ఫోన్లో సంప్రదించినా తాను అందుబాటులోకి రాలేదు.