02-12-2025 12:00:00 AM
ఇబ్బందులు పడుతున్న గ్రామాల రైతులు
కల్వకుర్తి డిసెంబర్ 1: వ్యవసాయ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా మూడు క్లస్టర్లకు ఒకే విస్తరణాధికారి బాధ్యతలు చేపట్టడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మొత్తం 9 గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు అవసరమైన ధ్రువీకరణ కోసం రైతులు విస్తరణాధికారిని వెతుక్కుంటూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
కల్వకుర్తి మండలంలోని పంజాగుల , తర్నికల్, కల్వకుర్తి మూడు క్లస్టర్ల పరిధిలో సుమారు 9 గ్రామాలు ఉన్నాయి. కల్వకుర్తి , తర్నికల్ వ్యవసాయ విస్తరణ అధికారులు వివిధ కారణాలతో సెలవులలో ఉండడంతో ఆ క్లస్టర్ పరిధిలోని రైతులకు అధికారుల కోసం పడిగాపులు తప్పడం లేదు. పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపాస్ యాప్ తప్పనిసరి కావడంతో దానిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఆశ్రయిస్తున్నారు. వరి దాన్ని అమ్ముకునేందుకు ఏఈఓ ఎంత విస్తీర్ణం దిగుమతికి ఎంత అవకాశం ఉందో ధృవీకరించాల్సి ఉండటంతో తప్పని పరిస్థితి నెలకొంది.
మొక్కజొన్న అమ్ముకునేందుకు అధికారుల ధ్రువీకరణ కావలసి ఉండడంతో వారికోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. తమ గ్రామానికి వ్యవసాయ అధికారిని నియమించాలని గ్రామస్తులు ఆందోళన సైతం చేపట్టి అధికారులకు వినతిపత్రం చేశారు. దీంతో పంజుగుల ఏఈఓ పాషా కు మరో రెండు క్లస్టర్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఒకే అధికారికి మూడు క్లస్టర్ కావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.
మూడు క్లస్టర్లలో పర్యటించాల్సి రావడంతో నిర్దిష్ట సమయానికి అందుబాటులో ఉండడం కష్టమవుతోంది. రైతులు ధ్రువీకరణ కోసం ఓ గ్రామం నుంచి మరొక గ్రామం తిరగాల్సి వస్తోంది. సీజన్ కావడంతో ధ్రువీకరణల సంఖ్య కూడా అమాంతం పెరిగింది. పంట కొనుగోలు కేంద్రాలు పూర్తిగా పనిచేయాలంటే గ్రామాల వారీగా విస్తరణాధికారులను నియమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏఈఓ లకు వీటితోపాటు సాధారణ స్కీములు, పంట నమోదు తదితర బాధ్యతలు ఉండడంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
కల్వకుర్తి, తర్నికల్ క్లస్టర్ లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నందున తాత్కాలికంగా పంజుగుల అదనపు బాధ్యతలు ఇస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రెండు క్లస్టర్లకు శాశ్వత ఏఈఓ లను నియమించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందించడం జరిగింది త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
సురేష్, కల్వకుర్తి మండల వ్యవసాయ అధికారి.
ప్రతి గ్రామానికి అధికారిని నియమించాలి..
రైతులు పంట సాగు పండించిన ధాన్యం అమ్ముకునేందుకు ప్రతి ఒక్కటి ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఉండడంతో ప్రతి గ్రామానికి ఒక ఏఈఓ ను నియమిస్తే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం అమ్ముకునే సమయం అయినందున అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా కల్వకుర్తి క్లస్టర్ అధికారిని ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలి.
- కృష్ణరాజ్, కల్వకుర్తి రైతు.