02-12-2025 12:59:06 AM
హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవాలే..
-నాచారం ఇండస్ట్రీయల్ అసోసియేషన్ మద్దతు తెలిపింది
-బీఆర్‌ఎస్ హయాంలోనేప్రభుత్వ భూములు ధారాదత్తం
-కన్వర్షన్ ఫీజు పెట్టి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు మాయం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాలసీని అడ్డుకోవా లని బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతూ.. అసత్య, అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించా రు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్వర్షన్ చార్జీ పెట్టి భూములు ధారాదత్తం చేయడమే కాకుండా టైటిల్ పార్కు కూడా చేసిందని మంత్రి మండిపడ్డారు. అప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ, ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై విమర్శలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు.
గాంధీభవన్‌లో సోమ వారం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ .. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సర్కార్ భూములను ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవో తీసుకొచ్చిందని, ప్రభుత్వ భూములపై యాజ మాన్య హక్కులను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే జీవో తెచ్చారని విమర్శించారు. ఖాయిలాపడిన పరిశ్రమలు, నిరూపయోగంగా ఉన్న భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హిల్ట్ పాలసీ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ప్రభు త్వ భూమిపై హక్కును బదిలీచేస్తున్నామనేది అబద్ధ్దమన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కంపెనీల వద్ద ఉన్న భూముల గురించే పాలసీ రూపొందించామన్నారు.
పరిశ్రమలకు సొంత భూము లు ఉన్న వారికి మాత్రమే కన్వర్షన్ అకాశం ఇచ్చామని, తాము తెచ్చిన హిల్ట్ పాలసీ విషయంలో ఎస్‌ఆర్‌వో రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామని తెలిపారు. పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్న వా రికే కన్వర్షన్ ఫీజు పెట్టామని, లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదని మంత్రి శ్రీధర్‌బాబు స్ప ష్టం చేశారు.
ప్రభుత్వ పాలసీని నాచారం ఇండస్ట్రీయల్ అసోసియేషన్ మద్దతు తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. రాహుల్ గాం ధీతో పాటు ఎవరికైనా కేటీఆర్ లేఖ రాసుకోవచ్చన్నారు. పాలసీ అమలుకు ఆపరేషన్ గైడ్‌లైన్స్ విడుదలయ్యాక అభ్యంతరా లుంటే చెప్పొచ్చన్నారు. అయితే పాలసీ లేకుండానే వందల ఎకరాల ప్రభుత్వ భూ ములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్వర్షన్ చేసిందన్నారు.
ఢిల్లీ కాలుష్యాన్ని కోరుతున్నారు..!
ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దని తాము ప్రయత్నం చేస్తుంటే.. ఢిల్లీ కాలుష్య పరిస్థ్ధితి హైదరాబాద్‌కు రావాలని బీజేపీ, బీఆర్‌ఎస్ కోరుకుంటున్నాయన్నారు. సిరీస్ అనే ఫార్మా కంపెనీకి సంబంధించిన వంద ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్వర్షన్ చేసిందని, అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఈ నిబంధనలు గుర్తుకు రాలేదా..? అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటున్నారని, కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తామంటే అడ్డుకుం టున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ తెచ్చిన గ్రిడ్ పాలసీలో 30 శాతం ఎస్‌ఆర్‌వో పెడితే పరిశ్రమలు ముందుకు రాలేదని, అందుకే తాము ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ అలసత్వం వల్లే హైదరాబాద్ పరిసరాల్లో కాలుష్యకారక పరిశ్రమలు పెరిగాయన్నారు. లీజ్ ల్యాండ్‌లను ఫ్రీ హోల్డ్ చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో తెచ్చిందని, దీంతో కొందరికే లాభం జరిగిందన్నారు. నాలుక ఉందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలుకు రుజువులు చూపించాలని మంత్రి సవాల్ విసిరారు.
కొన్ని రా ష్ట్రాలు 99 పైసలకే ఎకరం భూమి పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని, పట్టణాల్లో కాదనే విషయం ప్రతిపక్ష పార్టీలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ లేని దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్పేంటని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రూల్స్ తెలిసే విమర్శలు చేస్తున్నారని తెలిపారు.