02-12-2025 01:08:47 AM
ఔటర్ రింగ్ రోడ్డే.. ఇక జీహెచ్‌ఎంసీ సరిహద్దు
-సాధ్యసాధ్యాలపై భిన్న వాదనలు..
-సిబ్బంది కొరత, నిధుల లేమిని అధిగమించేదెలా?
-ధనిక, పేద మున్సిపాలిటీల మధ్య ఆర్థిక అంతరాల మాటేంటి?
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని విస్తరించి, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసేందుకు రాష్ర్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నవంబర్ 25న జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశంలోనూ ఈ అంశాన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి ఆమోదించారు. అయితే, కాగితంపై ఈ నిర్ణయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో.. ఆచరణలో దీని వెనుక అంతటి కఠినమైన సవాళ్లు ఉన్నాయన్నది పాలనా నిపుణుల మాట. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది.. దీని వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి..? క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిక్కుముడులేంటి..?
సామాన్యుడికి మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు, కాలుష్యరహిత వాతావరణం అందించినప్పుడే ఈ మెగా సిటీ కల సాకారం అవుతుంది. లేదంటే, సమస్యల చదరంగంలో హైదరాబాద్ మరో క్లిష్టమైన పరిస్థితిలో బందీ అవుతుంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచే క్రమంలో.. బస్తీవాసుల బతుకులు చిత్రవధ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 1 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణ లో మాత్రం అడుగడుగునా సవాళ్లు ఎదురుకానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది. విస్తరణ తర్వాత 2 కోట్లకు పెరగనుంది.
అంటే రాష్ర్ట మొత్తం జనాభాలో దాదాపు సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు. విస్తరణ తర్వాత దాదాపు 2,735 చదరపు కిలోమీటర్ల వరకు ఉండనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జె ట్ 8 వేల కోట్లు దాటగా.. విస్తరణ తర్వాత రూ.15 వేల కోట్లు దాటే అవకాశాలున్నా యి. విలీనం జరిగితే ప్రభుత్వం ముందుకు వచ్చే అత్యంత క్లిష్టమైన సమస్య సిబ్బంది కొరత. ప్రస్తుతం 650 చ.కి.మీ పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీనే సిబ్బంది కొరతతో అల్లాడుతోంది.
పారిశుధ్య కార్మికులు, దోమల నివారణ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే చెత్త సేకరణ, రోడ్ల నిర్వహణ కష్టంగా ఉంది. ఇప్పుడు అదనంగా 1400 చ.కి.మీ విస్తీర్ణం వచ్చి చేరితే.. ఈ సమస్యలను ఎలా పర్యవేక్షిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కొత్తగా వేలసంఖ్యలో ఉద్యోగులను నియమించే ఆర్థిక స్తోమత ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకమే. సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించినా, వారి జీతభత్యాలు తడిసి మోపెడవుతాయి.
సిబ్బందిని పెంచకుండా విలీనం చేస్తే.. అటు నగరంలో నూ, ఇటు శివార్లలోనూ సేవలు పడకేసే ప్రమాదం ఉంది. శివారు ప్రాంతాల్లో ఇంకా చాలా చోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు. సెప్టిక్ ట్యాంకులపైనే ఆధారపడుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కలిపాక వాటన్నిం టికీ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలంటే వేల కోట్లు ఖర్చవుతుంది. అలాగే మంచినీటి సరఫరా కోసం జలమండలి తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్లు శివా రు కాలనీల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి.
పన్నుల భారం.. తప్పదా..
ప్రభుత్వం ప్రస్తుతం పన్నులు పెంచబోమని చెబుతున్నప్పటికీ.. ఏకీకృత పాలన వ చ్చాక పన్నుల ఏకీకరణ తప్పనిసరి అవుతుం ది. ప్రస్తుతం చిన్న మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను తక్కువగా ఉంది. జీహెచ్‌ఎంసీలో విలీనమైతే.. నగరంతో సమానంగా కాకపోయి నా, ప్రస్తుతం ఉన్నదాని కంటే కచ్చితంగా పన్నులు పెరుగుతాయి. చెత్త సేకరణ ఛార్జీ లు, నీటి బిల్లులు, నాలా పన్ను వంటివి అదనపు భారం కావచ్చు. ఇది మధ్యతరగతి ప్రజ లకు ఆందోళన కలిగించే అంశం. 2007లో అప్పటి ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను కలిపి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేసింది.
అల్వాల్, ఉప్పల్, కాప్రా, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలు నగ రంలో కలిశాయి. విలీనమై 17 ఏళ్లు గడిచినా .. మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా వంటి ప్రాం తాల్లో నేటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయి. అంటే, కేవలం విలీనం చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదని తేటతెల్లమైంది. సరైన ప్రణాళిక, సరిపడా నిధులు లేకుండా విలీనం చేస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఈసారి పక్కా ప్రణాళికతో వెళ్తేనే ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ బూమ్ తప్పదు..
విలీన నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రం పెద్ద వరంగా మారనుంది. జీహెచ్‌ఎంసీ లిమిట్స్ అనే ట్యాగ్ పడితే చాలు.. భూముల రేట్లు అమాంతం పెరుగుతాయి. పెద్దఎత్తున వెంచర్లు, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తాయి. బిల్డింగ్ పర్మిషన్లు సులభతరం అయితే ద్వారా నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. రిజిస్ట్రేషన్లు, బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది.
అయితే, ఓఆర్‌ఆర్ లోపల ఇంకా వందలాది గ్రామాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. విలీనంతో ఈ ప్రాంతాల్లో పట్టణీకరణ వేగవంత మై.. గ్రామీణ సంస్కృతి, వ్యవసాయం పూ ర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై కాంక్రీట్ జంగిల్స్‌గా మారే ముప్పు లేకపోలేదు. హై డ్రా వంటి సంస్థలు ఉన్నా.. రియల్ మాఫియాను అడ్డుకోవడం సవాలే.
జీహెచ్‌ఎంసీ విస్తరణ అనేది కాలగమనంలో జరగాల్సిన పరిణామమే. అంతర్జాతీ య నగరంగా ఎదగాలంటే ఇది అవసరం. కానీ, ఇది కేవలం సరిహద్దులు మార్చే ప్రక్రియగా మిగిలిపోకూడదు. సామాన్యుడికి మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు, కాలుష్యరహిత వా తావరణం అందించినప్పుడే ఈ మెగా సిటీ కల సాకారం అవుతుంది. లేదంటే, సమస్య ల చదరంగంలో హైదరాబాద్ మరో క్లిష్టమైన పరిస్థితిలో బందీ అవుతుంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచే క్రమంలో.. బస్తీవాసుల బతుకులు చిత్రవధ కాకుండా చూ డాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
ఆర్థిక అసమానతలు..
విలీనమవుతున్న 27 మున్సిపాలిటీల్లో ఆర్థికంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ము న్సిపాలిటీలుగా మణికొండ, నార్సింగి, కొం పల్లి, బండ్లగూడ జాగీర్, తెల్లాపూర్ వంటివి రియల్ ఎస్టేట్ బూమ్‌తో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అక్కడ మౌలిక వసతులు కొం త మెరుగ్గా ఉన్నాయి. పూర్ మున్సిపాలిటీలుగా జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగా రం, తుక్కుగూడ, జల్‌పల్లి వంటి మున్సిపాలిటీలు ఆదాయం లేక, కనీస రోడ్లు, డ్రైనేజీ లేక సతమతమవుతున్నాయి.
అయితే ధనవంతులైన మున్సిపాలిటీల నుంచి వచ్చే మి గులు ఆదాయాన్ని, పేద మున్సిపాలిటీల అభివృద్ధికి మళ్లించే అవకాశం ఉంది. దీనివల్ల సమతూకం వస్తుందని ప్రభుత్వం భావి స్తోంది. మణికొండ, నార్సింగి వాసులు తమ పన్నుల డబ్బు తమ ప్రాంత అభివృద్ధికి కా కుండా వేరే చోటికి మళ్లిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది భవిష్యత్తులో స్థానికంగా అసంతృప్తికి దారితీయవచ్చు.
విజయవంతం కావాలంటే..
భవిష్యత్ పరిపాలన ఎలా ఉండాలి?.. విలీనం విజయవంతం కావాలంటే ప్రభు త్వం ఈ కింది చర్యలు తప్పక తీసుకోవాలని పట్టణ ప్రణాళిక నిపుణులు సూచిస్తున్నా రు. మొత్తం నగరాన్ని ఒకే కమిషనర్ పాలించడం అసాధ్యం. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 10- నుంచి 12 జోన్లకు పెంచాలి. జోనల్ కమిషనర్లకు పూర్తి ఆర్థిక, పరిపాలన అధికారాలు ఇవ్వాలి. చిన్న చిన్న సమస్యలకు హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు.
విలీన ప్రాంతాల అభివృద్ధికి వచ్చే ఐదేళ్ల పాటు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. కేవలం అక్కడి పన్నుల ఆదాయంపైనే ఆధారపడకుండా.. ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో నిధులు ఇవ్వాలి.యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలి. ప్రతి 500 ఇళ్లకు ఒక పారిశుధ్య కార్మికుడు ఉండేలా చూడాలి. ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న గ్రోత్ కారిడార్లలో ప్రజా రవాణాను మెట్రో, బస్సులు విస్తరించాలి. లేదంటే ట్రాఫిక్ సమస్యలు నరకప్రాయంగా మారుతాయి.
ప్రభుత్వం ఆలోచన..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ భారీ నిర్ణయం వెనుక ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. సమగ్ర అభివృద్ధి ప్రస్తుతం కోర్ సిటీ పాత ఎంసీహెచ్ ఒకలా, విలీన ప్రాంతాలు మరోలా, శివారు మున్సిపాలిటీలు ఇంకోలా అభివృద్ధి చెందుతున్నాయి.
ఒక రోడ్డు వేయాలన్నా, డ్రైనేజీ పైప్‌లైన్ వేయాలన్నా.. ఒక మున్సిపాలిటీ దాటగానే మరో మున్సిపాలిటీ అనుమతులు, నిధుల కొరత అడ్డంకిగా మారుతోంది. ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఒకే పాలనా గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా మాస్టర్ ప్లాన్‌ను ఏకతాటిపై అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను మెగా సిటీగా ప్రొజెక్ట్ చేయాలంటే జనాభా, విస్తీర్ణం కీలకం.
2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు 2 కోట్ల జనాభాతో కూడిన నగరం ఏర్పడితే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ , జైకా వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ నిధులు, రుణాలు పొందడం సులభమవుతుంది. రాజకీయంగా చూస్తే.. శివారు ప్రాంతాల్లో ఉన్న వివిధ సమీకరణాలను ఒకే గొడుగు కిందకు తేవడం ద్వారా పాలనపై పట్టు సాధించవచ్చని, తద్వారా నియోజకవర్గాల పునర్విభజన లేదా వార్డుల పెంపు ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
విలీన నిర్ణయం వెలువడగానే అధికారులు తెర వెనుక భారీ కసరత్తు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గత కోన్ని రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వారు ప్రధానంగా దృష్టి పెట్టిన అంశాలు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే.. కొన్ని వార్డుల్లో లక్షల్లో జనం ఉంటే, మరికొన్నింటిలో వేలల్లోనే ఉన్నారు.
ఈ అసమానతలను తొలగించి, కొత్తగా వచ్చే 27 మున్సిపాలిటీలను కలుపుకుని వార్డుల సంఖ్యను 250కు పెంచాలని అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రస్తుతం ఒక సర్కిల్ రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంటోంది. దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని సవరించి.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు సర్కిళ్లు ఉండేలా డీలిమిటేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కాప్రా, బేగంపేట్ సర్కిళ్లలో ఈ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 28 సర్కిళ్లలో పనులు జరుగుతున్నాయని సమాచారం.
విలీనం కానున్న ప్రాంతాలు
--మేడ్చల్‌మల్కాజ్‌గిరి : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్.
--రంగారెడ్డి : బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అం బర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మ ణికొండ, ఆదిబట్ల, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం కొంత భాగం.
--సంగారెడ్డి : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్.