01-08-2025 01:15:21 AM
-సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో పిల్ దాఖలు
-మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణ కు స్వీకరించిన హైకోర్టు.. పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిగాచీ ప్రమాదంపై కె.బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకోపోవడం వల్లే పేలుడు జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పేలుడు కారణంగా చనిపోయిన వారిలో ఇంకా ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుదా నాగరాజు ధర్మసనానికితెలిపారు. బాధితులకు పరిహారం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ చెల్లించలేదన్నారు. సిగాచీ పరిశ్రమ యాజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని, ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలని న్యాయవాది కోర్టును కోరారు. గత నెల 30న సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 54 మంది మృతి చెందగా.. 28 మంది గాయపడిన సంగతి తెలిసిందే.