02-08-2025 05:05:07 PM
చౌటుప్పల్ (విజయక్రాంతి): చౌటుప్పల్ పట్టణంలో గల గ్రీన్ గోవ్ పాఠశాల(Green Grove School)లో శనివారం రోజున స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు నెలలో మొదటి ఆదివారం రోజున నిర్వహించే ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వతహాగా తయారుచేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ స్నేహ బంధానికి గుర్తుగా ఒకరికొకరు కట్టుకొని తమ స్నేహం చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుకున్నారు. విద్యార్థులు స్నేహానికి సంబంధించిన పాటలను పాడి నృత్యాలు ప్రదర్శించారు. స్నేహం యొక్క గొప్పతనం గురించి చక్కగా ఉపన్యసించారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్పర్సన్ శ్రీమతి బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మనిషి జీవితంలో అత్యున్నతమైన బంధం స్నేహబంధమేనని స్నేహానికి కుల, జాతి, మత, వర్ణ భేదాలు, ధనికా పేద, ఆడ మగ బేధాభిప్రాయాలు లేనటువంటి కల్మషము లేని మనుషుల మనస్సుల కలయికని తెలియజేశారు. అదేవిధంగా ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా స్నేహంగా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎస్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.