12-10-2025 12:36:16 AM
శత్రుదుర్భేద్యమైన కోట బురుజులు.. శతాబ్దాల నాటి కట్టడాలు.. గౌనీలు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగ మార్గం.. ఇలా చెప్పుకుంటూ పోతే పురాతన చరిత్రకు అందోల్ ఆలవాలం.. కానీ ఇది ఒకప్పటి మాట. చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఈ కట్టడాలు, శిల్పాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ అపురూప కట్టడాలు కూలిపోతున్నా.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించడంతో ఆ ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే కొన్ని కట్టడాలు కూలిపోగా మిగిలిన గుర్తులు చెరిగిపోయే దశకు చేరుకున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న పట్టణం సంగారెడ్డి. దీనికి చరిత్ర పుటల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఒకటైన అందోల్ పరసర ప్రాంతాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు నేటికీ పత్యక్షమవుతాయి. కానీ అధికారుల నిర్లక్ష్యానికి శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఏర్పడింది. చరిత్రను నిర్వీర్యం చేసిన స్థితిగతులు వాటి పరిరక్షణకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు కానరావడం లేదు.
ఎప్పుడు కూలుతాయోనని..
అందోల్‌లో ప్రవేశించగానే రాజుల పాలన నాటి కట్టడాలు కనిపిస్తాయి. కానీ, అవి ప్ర స్తుతం శిథిలావస్థకు చేరాయి. మున్సిపాలిటీగా ఉన్న అందోల్‌లో నాడు నిర్మించిన ప్ర హరీ అదృశ్యమైంది. అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందోల్- జోగిపేట్ పురపాలక పరిధిలో ఘన చరిత్ర కలిగిన బురుజులు మరమ్మతులకు నోచుకోక కూలిపోయే దశకు చేరాయి.
అప్పట్లో ఈ ప్రాంతంలో 3 గౌనీలు, 36 బురుజులు ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగ మార్గాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు మాత్రం గత వైభవం తాలుకు ఆనవాళ్లు పూర్తిగా మాయంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల ఉన్న వాటిని పునరుద్ధరించకపోవడం వల్ల అవి ఎప్పుడు కూలుతాయోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
కోట బురుజులు మాయం
అందోల్ కేంద్రంగా రాణి శంకరమ్మ పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె పాలనలో అందోల్ సంస్థానాన్ని శత్రువుల నుంచి కాపాడేందుకు శత్రుదుర్భేద్యమైన కోట బురుజులు నిర్మించారు. ప్రస్తుతం ఆ చరిత్ర దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి. అందోల్ చరిత్ర ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుడు ఈ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా పాలించాడు. దేశాయిని తన సామంతరాజుగా నియమించుకుని ఈ కోటలను వారి కాలంలో నిర్మించారు.
అప్ప టి రాజుల పాలనకు ఇవి చారిత్రక ఆనవాలు గా నిలుస్తున్నాయి. రాణి శంకరమ్మ పరిపాలిస్తున్న కాలంలో రాత్రి 7గంటలు దాటితే గ్రామంలోనికి వీటి నుంచి ప్రవేశం ఉండేదికాదు. అత్యవసరమైతే పక్కనే ఉన్న చిన్న గేటు ద్వారా లోనికి అనుమతించే వారు.
అంత పటిష్ట బందోబస్తు ఉండేదని స్థానికు లు చెబుతున్నారు. ఇవి ప్రభుత్వ భూములు కావడంతో ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలున్నాయి. అదే క్రమంలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చరిత్ర గుర్తులను పదిలం చేస్తే రాబోయో తరాలకు దిక్సూచిగా అందోల్ నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు .
వెయ్యేళ్లనాటి శిల్పాలు
అందోల్‌లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపారు. శ్రీరంగనాథాలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు.. రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కినవని వెల్లడించారు.
ఎ.చంద్రశేఖర్‌రావు (విజయక్రాంతి - ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో)