12-10-2025 12:33:39 AM
తెలంగాణలోని అత్యంత పురాతనమైన శివాలయాల్లో కరీంనగర్ జిల్లా మంథనిలోని శైవక్షేత్రం ఒకటి. ఇదొక వేద అభ్యాస కేంద్రం. రెండు ఆలయాల సమాహార ముక్తిధామం. ఒకటి భిక్షేశ్వరుడి ఆలయం. రెండోది గౌతమేశ్వరుడి ఆలయం. నాటి చరిత్రకు ఈ రెండు ఆలయాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
మంథని వెయ్యి బ్రాహ్మణ కుటుంబాలు లేదా సహస్ర బ్రాహ్మణ గడపకు నివాసంగా ఉందని నమ్ముతారు. ‘దక్షిణ గంగా’ నది గోదావరి కుడి ఒడ్డున ఉంది . మంథని చరిత్ర వివిధ పండిత వ్యక్తుల ప్రకారం.. ఆది శంకరాచార్యులు ఈ గ్రామాన్ని సందర్శించారు.. గ్రామంలో వేద మంత్రాల నిరంతర పారాయణం చూసి ముగ్ధులై దీనిని ధర్మ-పీఠంగా గుర్తించారు.
వేదాలు, తర్కం, వ్యాకరణం, జ్యోతిషం , ఛందస్సు, మీమాంస వంటి అంశాలను సంస్కృత పండితులు ఇక్కడ బోధించారని చెబుతారు. మంథని ప్రాముఖ్యత పురావస్తు, చారిత్రక మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అనేక పురాతన దేవాలయాలకు మంథని నిలయం. మంథని దేవాలయాలకు ఎక్కువ కాకతీయ కాలంలో నిర్మాణ పనులు జరిగాయి. అవి ప్రారంభ బౌద్ధ, జైన సంస్కృతికి నిలయంగా ఉండేవి.
ఈ దేవాలయాలన్నీ మంథని జైన, మత బౌద్ధమతానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేవని స్పష్టం చేస్తున్నాయి. మంథని ఆలయం గౌతమేశ్వరుడు లేదా శివుడిని ప్రధాన పూజించే దేవతగా ప్రతిష్ఠించింది. ఈ గ్రామంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, గౌతమేశ్వర ఆలయం, వినాయక ఆలయం, దత్తాత్రేయ ఆలయం, సరస్వతి ఆలయం,రామాలయలు ఉన్నాయి.
మంథని శివారు వన్యప్రాణుల అభయారణ్యం, గోదావరి నది ప్రత్యేక ఆకర్షణ. అభయారణ్యం మంథని నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. ఈ నదీ అడవి గోదావరి నదిలోని మార్ష్ మొసళ్లకు నిలయం. ఈ అభయారణ్యం చిరుతపులులు, స్లోత్ ఎలుగుబంట్లు, బ్లాక్ బక్, చిరుతలు, కొండచిలువలు ఉండేవి.
-సామివారి దర్శనం పూర్వజన్మ సుకృతం..
ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం. ఇలాంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు. కార్తీకమాసంలో భక్తులు శైవక్షేత్రాలను ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అత్యంత పురాతనమైన శివాలయాల్లో మంథనిలోని శైవక్షేత్రం ఒకటి. మంథని ఆలయాల సమాహార ముక్తిధామం. ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి. అవి భిక్షేశ్వరుడు, గౌతమేశ్వరుడు ఆలయాలు. నాటి చరిత్రకు అవి సజీవ సాక్ష్యాలు.
- భిక్షేశ్వరస్వామి దేవాలయం..
సాధారణంగా ఆలయాలు ఆగమశాస్త్రానుసారం ఉంటాయి. ద్వారం, ధ్వజం ప్రతిదీ శాస్ట్రోక్తంగా ఏర్పాటు చేస్తారు. కొన్ని ఆలయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి గుళ్లు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. మంథనిలో కొలువుదీరిన భిక్షేశ్వరస్వామి దేవాలయం అలాంటిదే. కాశీ తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రంగా కీర్తి గడించింది. సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంతో నిర్మిస్తారు.
కానీ, పశ్చిమ ముఖంతో విరాజిల్లే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. మంథనిలోని భిక్షేశ్వరస్వామి ఆలయం పశ్చిమ ముఖద్వారం కలిగి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని ఆలయం తర్వాత పశ్చిమ ముఖద్వారం కలిగిన గుడి ఇదే కావడం విశేషం. అంతేకాదు, దేశంలో మరెక్కడా లేనివిధంగా దక్షిణామూర్తి లింగ రూపంలో వెలసిన క్షేత్రం కూడా ఇదే. పశ్చిమ ముఖద్వారం కలిగిన భిక్షేశ్వరుడి ఆలయంలో పశ్చిమ ముఖంలో శివుడు, అదే గర్భగుడిలో దక్షిణ ముఖంతో దక్షిణామూర్తి కొలువుదీరారు. భిక్షేశ్వరుడి అనుగ్రహంతో సర్వకార్యాల్లో విజయం కలుగుతుందని విశ్వాసం.
ఈ స్వామికి అభిషేకాలు చేయిస్తే జాతకంలోని శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. వేదవేదాంగాలకు మంథని కేంద్ర బిందువుగా మారడానికి ఇక్కడి దక్షిణామూర్తి కారణమని చెబుతారు. విద్యకు మారుపేరుగా నిలిచే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంత్రపురి వేదవిద్యకు నిలయంగా మారిందని స్థానికుల నమ్మకం. ప్రతి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజ స్తంభం ఉంటుంది.
భిక్షేశ్వరుడి గుడిలో ద్వజ స్తంభు లేకపోవడం మరో విచిత్రం. ధ్వజస్తంభం లేని ఆలయం దేశంలో ఇదొక్కటేనేమో. దక్షిణామూర్తి అనుగ్రహం కోసం విద్యార్థులు వస్తుంటారు. ఎప్పుడూ సందడిగా కనిపించే ఈ క్షేత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత కోలాహలంగా మారుతుంది. భిక్షేశ్వరుడిని దర్శించుకుంటే రాజసూయయాగం చేసినంత ఫలమని అంటారు.
గౌతమేశ్వరాలయం..
గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల గౌతమేశ్వరాలయం అనే పేరు వచ్చింది. మాఘ మాసంలో నియమానుసారం ఇక్కడ స్నానదానాదులు చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుమానంతో పార్వతీదేవి..
గంగను వదిలేయమని శివుడిని వేడుకోగా అందుకు శివుడు అంగీకరించలేదు. దాంతో పార్వతి అలుక వహిస్తుంది. ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటపెట్టుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు.
అక్కడున్న జయని పిలిచి ఆవు రూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో మేస్తుండుగా, గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్థించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపజేస్తాడు.
అదే గోదావరి నది. శివుడిని కూడా తనతోపాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా, ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఇక్కడ ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకించాడు. అదే గౌతమేశ్వరుడు ఆలయం. తూర్పు దిశగా ప్రవహించే గోదావరి ఆలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తర ముఖంగా ప్రవహిస్తోంది.
---మాధారపు మనీషా, కరీంనగర్