29-08-2025 07:42:17 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయ క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి హాజరై ధ్యాన్ చంద్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన క్రీడాకారుడిగా, హాకీ క్రీడా మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా క్రీడా రంగం వైపు అడుగులు వేసేలా మార్గదర్శకుడిగా నిలిచాడని అన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.