22-08-2025 01:55:10 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు- 2025 గురువారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బుధవారం లోక్‌సభలోనూ మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు, గురువారం రాజ్యసభలో కూడా ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో పాస్ అయింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే గేమింగ్ ఇండస్ట్రీలో పని చేసే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కేంద్రం మాత్రం బిల్లును సమర్థించింది. ఈ బిల్లు ప్రకారం అన్ని రకాల గ్యాంబ్లింగ్ గేమ్స్, ఆన్‌లైన్ ఫాంటసీ స్టోర్స్, ఆన్‌లైన్ లాటరీలు నిషేధం.
కేవలం ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహించే వారు మాత్రమే కాకుండా వాటికి అడ్వర్టుజ్ చేసే వారికి కూడా భారీగా జరిమానాలు విధించనున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారని మల్లికార్జున్ ఖర్గే ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య చర్చ ఎలా సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
డ్రగ్స్ లాంటిదే: అశ్విని వైష్ణవ్
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార, సాంకేతిక మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘మనీ గ్యాంబ్లింగ్ వ్యసనం అనేది డ్రగ్స్ వ్యసనం లాంటిదే. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ను నడిపించే పరపతి గల వ్యక్తులు ఈ నిర్ణయాలను కోర్టులో సవాలు చేయొచ్చు. వారు ఈ నిషేధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఏర్పడే దుష్పరిణామాలు, వీటి ద్వారా సమకూరే డబ్బు ఎలా టెర్రరిస్టులకు చేరుతుందో మేం చూశాం’ అని తెలిపారు. మనీ గేమ్స్ ప్రకటనలు చేస్తే గరిష్ఠంగా రెండేండ్ల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల జరిమానా పడే అవకాశం ఉంది. మనీ గేమ్‌లకు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తే గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా. ఈ చట్టం ప్రకారం కొన్ని ముఖ్యమైన సెక్షన్ల కింద నేరాలు శిక్షార్హమైనవి. నాన్ బెయిలబుల్‌గా పరిగణించబడతాయి.