calender_icon.png 22 August, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్యలు ముందా.. అసెంబ్లీలో చర్చ ముందా?

22-08-2025 01:37:50 AM

  1. కాళేశ్వరం నివేదికపై ఏజీకి హైకోర్టు ప్రశ్న 
  2. శాసనసభలో చర్చ పెట్టాలనుకుంటే నివేదికను ఎందుకు బహిర్గతం చేశారు? 
  3. 60 పేజీల నివేదిక స్పష్టంగా కనిపించడం లేదు.. 
  4. స్పష్టంగా కనిపించే కాపీ సమర్పిస్తే విచారించగలం..
  5. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పిటిషన్‌పై హైకోర్టు విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ చర్చిస్తారా?’ అని హైకోర్టు గురువారం మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.

అలాగే ప్రభుత్వం సమర్పించిన 60 పేజీల నివేదిక సరిగ్గా కనిపించడం లేదని, తమకు స్పష్టంగా కనిపించేలా నివేదిక సమర్పిస్తే విచారించగలమని కోర్టు స్పష్టం చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణ ప్రారంభం కాగానే, పిటిషనర్ తరఫు అడ్వొకేట్ ఆర్యామ సుందరం తన వాదనలు వినిపించారు.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. సరైన విధానంలో కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేయలేదని, విచారణ పూర్తయిన తర్వాత ఆ నివేదిక కాపీలను పిటిషనర్లకు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమకు కాపీలు అందించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించు కోలేదని పేర్కొన్నారు. నివేదికపై రాష్ట్రప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజకీయంగా కేసీఆర్, హరీశ్ రావుకు నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నివేదికలో ఉన్న విషయాలను వెల్లడించారని, అదేవిధంగా వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేశారని వివరించారు. నివేదికపై రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదికపై 60 పేజీల రిపోర్ట్ సైతం రూపొందించిందని తెలిపారు. ప్రతి మీడియా ప్రతినిధికి ఆ 60 పేజీల రిపోర్ట్ ఇచ్చారని వివరించారు.

ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావు శాసనసభ సభ్యులని, అందుకే కాళేశ్వరం నివేదికపై రాష్ట్రప్రభుత్వం శాసనసభలో చర్చ పెట్టాలని నిర్ణయించిందని కోర్టుకు తెలుపుతుండగా, న్యాయమూర్తి అడ్డుకుని.. ‘మరి అలాంటప్పుడు నివేదికలో ఉన్న అంశాలను మీడియా ఎదుట ఎందుకు బహిర్గతం చేశారు.’ అని ప్రశ్నించింది.

తర్వాత అడ్వొకేట్ జనరల్ తన వాదన కొనసాగిస్తూ.. క్యాబినెట్ సులభంగా అర్థం చేసుకునేలా కమిటీ 60 పేజీల నివేదిక రూపొందించిందని, అసెంబ్లీలో చర్చ తర్వాత తదిపరి చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. అసెంబ్లీలో చర్చించే వరకు పిటిషన్‌ను విచారించొద్దని న్యాయస్థానాన్ని కోరారు.  అలాగే కౌంటర్ దాఖలుకూ కొంత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే సెక్షన్ 8బీ ప్రకారం నోటీసులు ఇవ్వలేని పిటిషనర్లు తప్పుబట్టడం చెల్లదని వాదించారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘సెక్షన్ 8 కింద కాకుండా మరి ఏ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు సాయం త్రం వరకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరడంతో న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అలాగే న్యాయ స్థానంలో ప్రభుత్వం సమర్పించిన నివేదికలోని డేటా సరిగా కనిపించడం లేదని, తమకు స్పష్టంగా కనిపించేలా నివేదిక సమర్పి స్తే విచారించగలమని కోర్టు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.