calender_icon.png 22 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆట ఆగేనా?

22-08-2025 01:42:04 AM

కేంద్రం తెచ్చిన బిల్లుతో ఆన్‌లైన్ గేమింగ్‌ను అరికట్టడంపై అనుమానాలు

  1. దేశంలో నిషేధించినా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేసే అవకాశం
  2. వీపీఎన్, ఏపీకే ఫైల్స్ వినియోగించనున్న నిర్వాహకులు
  3. నిషేధంతోపాటు నియంత్రణ అత్యంత అవసరం

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బిల్లును తీసుకొచ్చింది. అయితే ‘శత కోటి సమస్యలకు అనంత కోటి ఉపాయలు’ అన్న నానుడి సైబర్ నేరగాళ్లకు సరిగ్గా సూటవుతుంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ద్వారా జరిగే అక్రమ వ్యాపారానికి కొంతమేర అడ్డుకట్ట వేయగలిగినప్ప టికీ పూర్తి స్థాయిలో వాటిని అరికట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్ గేమింగ్ ఆపరేటింగ్ అనేది వివిధ దేశాల చట్టాలు, లైసెన్సులు, ప్రభుత్వ నియంత్రణలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతిస్తూ నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేసుకోగా.. మరికొన్ని దేశాలు, బెట్టింగ్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటూ గేమింగ్ బిల్లులను ఆమోదించాయి. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు వివిధ దేశాల్లోని వినియోగదారులకు సేవలు అందించడానికి ఆయా దేశాల్లో లైసెన్సులు పొందాలి.

నిబంధనలకు లోబడే గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుం ది. అలాంటి అవకాశం లేని కంపెనీలు, ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైల్స్ ద్వారా చట్ట విరుద్ధమైన గేమింగ్ యాప్‌లకు సంబంధించిన లింకులను పంపిస్తాయి. అయితే, ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా వినియోగదారులకు అనేక రకాలుగా నష్టాలు సంభవిస్తాయి.

ఏపీకే ద్వారా గేమింగ్ యాప్‌ల నిర్వహణలో సైబర్ నేరగాళ్లు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్)ను వినియోగించుకుని నేరాలను కొన సాగిస్తారు. ఆన్‌లైన్ గేముల వినియోగదారులు వీపీఎన్ ద్వారా తమ లొకేషన్లను మార్చుకుని సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం పొంచి ఉంది. 

ఏపీకే ఫైల్స్‌తో జర భద్రం..

నేటి డిజిటల్ ప్రపంచంలో, మొబైల్ యాప్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా బయటనుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఏపీకే ఫైల్ ఫార్మాట్ కనిపిస్తుంది. యూజర్లు ఏపీకే ఫైల్‌లను ఓపెన్ చేయాలన్నా, లేదా ఇన్‌స్టాల్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఏపీకే ఫైల్స్ వల్ల మొబైల్ హ్యాకింగ్‌కు గురికావడమో, బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావడమో జరుగుతుంది.

ఏపీకే ఫైల్‌లలో డేటాను దొంగిలించడానికి రూపొందించిన మాల్ వేర్, స్పువేర్ ఉంటాయి. చాలా మంది సైబర్ నేరగాళ్లు నిజమైన బ్యాంకింగ్ యాప్‌లా కనిపించే నకిలీ యాప్‌లను సృష్టిస్తారు. వాటిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ల కీ స్ట్రోక్‌లను రికార్డ్ చేస్తాయి. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తాయి.

ఎస్‌ఎంఎస్, కాంటాక్ట్ డేటాకు యాక్సెస్ కూడా పొందుతాయి. ఫోన్లను రిమోట్‌గా నియంత్రించే అవకాశమూ ఉన్నది. అయితే అన్ని ఏపీకే ఫైళ్లు ప్రమాదకరమైనవి కానప్పటికీ, గేమింగ్ యాప్‌ల వంటి హానికరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యూజర్లు డబ్బును కోల్పోయిన సందర్భాలు అనేకం. 

పాటించాల్సినవి..

గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లు వంటి నమ్మదగిన సైట్ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎస్‌ఎంఎస్, వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చే రాన్‌డమ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. క్యాష్‌బ్యాక్, ఉచిత రీఛార్జ్ లేదా అత్యవసర బ్యాంకింగ్ అప్‌డేట్‌ల పట్ల జాగ్రత్త వహించాలి. ఇన్‌స్టాల్ చేయడానికి ముందు, ఆ తర్వాత యాప్ అనుమతులను తనిఖీ చేయాలి. గుర్తింపు పొందిన మొబైల్ యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌ను ఉపయోగించాలి. మీ ఫోన్ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆన్‌లో ఉంచుకోవాలి. పరిచయం లేని యాప్‌లలో, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు లేదా ఓటీపీలను ఎప్పుడూ నమోదు చేయవద్దు.

టెక్నాలజీ సహాయంతో నియంత్రించాలి..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు చరిత్రాత్మకం, శుభపరిణామం. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల కారణంగా ఇప్పటికే ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఇకపై పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం. తెలంగాణలో గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు నేరాలు పెరగడానికి సెలబ్రటీలు, యూట్యూబర్ల ప్రమోషన్ చేయడం కూడా ఒక కారణమే. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే యాప్‌లపై నిషేధం ఉండేది.

ప్రస్తుత బిల్లుతో దేశవ్యాప్తంగా నిషేధించేందుకు అవకాశం లభిస్తుంది. కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చే ఏజెన్సీతో ఈ నేరాలను నియంత్రించే అవకాశం ఉంది. దీని ద్వారా ముఖ్యంగా ప్రజల్లో నిషేధిత యాప్‌ల పట్ల అవగాహన పెరుగుతుంది. అయితే వీపీఎన్, ఏపీకే ఫైళ్లతో ప్రమాదం పొంచి ఉంది.

ఈ ప్రమాదాన్ని నివారించే దిశగా తగిన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉన్నది. వీపీఎన్, ఏపీకే ఫైళ్లపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అత్యాధునిక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నేరాలను నియంత్రించే ప్రయత్నం చేయాలి. ప్రతిఒక్కరూ ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ

అప్రమతత్తే పరిష్కారం.. 

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల సర్వర్లు వేరే దేశాల్లో పెట్టి వీపీఎన్ ద్వారా ఆపరేట్ చేస్తారు. యాక్సెస్ చేయకుండా అడ్డుపడటం సాధ్యపడదు. ఆర్థిక లావాదేవీలు జరగకుండా కూడా అడ్డపడటం కూడా సాధ్యపడదు. పారదర్శంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చట్టమైన నేరస్థులను పట్టుకున్నప్పుడే అమలు అవుతుంది. నేరగాళ్లను పట్టుకోలేకపోతే చట్టాలు ఏమీ చేయలేవు.

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ద్వారా నేరాలు చేసే వారిని పట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల రూపకల్పన ద్వారా ప్రజల్లో కొంత వరకు అవగాహన వస్తుంది. నేరగాళ్ల యాక్టివిటీ కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిస్థాయిలో కట్టుదిట్టం చేయడం మాత్రం సాధ్యపడదు.

నేరగాళ్లు కూడా ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడమే ఆన్‌లైన్ గేమింగ్ నేరాలకు నివారణకు పరిష్కారం. ప్రతిఒక్కరూ ఎవరికీ వారుగా నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. 

నల్లమోతు శ్రీధర్, సైబర్ హ్యాకింగ్ నిపుణుడు