09-05-2025 02:06:11 AM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నల్లగొండ, మే 8 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ఒకటి భూ భారతి, మరొకటి ఇందిరమ్మ ఇండ్లు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4.23 లక్షలు ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్నారన్నారు.
అట్టడుగునా ఉన్న పేదవారికి ఇల్లు ఇవ్వాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. రెండవ విడత మొదటి విడత రానివారందరికీ ఇండ్లు వస్తాయని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా కేటాయిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి రెండు వందల ఇండ్లకు ఒక గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేసి సర్వే నిర్వహించిన తర్వాత జాబితా రూపొందించామని, ఆ జాబితాను ఇన్చార్జి మినిస్టర్ ఆమోదంతో లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పారు.
ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని, తహసిల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని మంజూరు చేయాలని, గతంలో ఎస్‌ఎల్ బిసీ కోసం తీసుకోన్న భూముల సమస్యను పరిష్కరించాలన్నారు.
అలాగే ఇనుపాముల గ్రామంలో ఒకే వ్యక్తిపై 50 నుండి 100 ఎకరాలు లెక్కించడం జరిగిందని, దానిని సరిచేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ శంబయ్య, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇంఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.