30-09-2025 01:23:15 AM
పొంతన కుదరని లెక్కలు
అవినీతిమయమైన ‘మంచిర్యాల గీతపారిశ్రామిక సహకార సంఘం’
మంచిర్యాల, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మంచిర్యాలలో కులవృత్తిపై ఆధా రపడి జీవనం సాగించిన గీత కార్మికులు 1970 ప్రాంతంలో మంచిర్యాల ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పేరిట సంఘాన్ని రిజిస్టర్డ్ చేయించారు. నాటి నుంచి నేటి వరకు సంఘం కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. ఆ రోజుల్లో సంఘంలోని సభ్యులంతా కలిసి డిపోను నడిపి లాభాలను సమానంగా పంచుకునే వారు..,
రాను రాను ఒక్కరే వేలంలో పాడుకొని ఆ మొత్తాన్ని సంఘంలోని సభ్యులందరు సమానంగా పంచుకోవడం జరుగుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.., మెల్ల మెల్లగా సంఘాన్ని కొంత మంది స్వార్థపరులు తమ చేతుల్లోకి తీసుకొని అమాయక సభ్యుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని లక్షలకు లక్షలు దండుకుంటున్నారు.
39 మంది సభ్యులతో ప్రారంభమై..
ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం మొదట 39 సభ్యులతో 1970లో ప్రారంభమైంది. తర్వాత 100 మందికి చేరుకుంది. ఈ సమయంలో కొత్తగా సంఘంలో చేరాలనుకునే వారికి ఎక్సైజ్ అధికారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించి చెట్లు ఎక్కి కల్లు గీసిన వారికే అవకాశం కల్పించారు. గత సంవత్సరం ఒక్కసారిగా సంఘంలోకి కొంత మంది వారి స్వార్థం కోసం 44 మందిని ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండా, పరీక్షలు నిర్వహించకుండా చేర్చడంతో సంఘ సభ్యుల సంఖ్య అనధికారికంగా 144కి చేరింది.
సభ్యుల పెంపు ఎవరి లాభం కోసం?
మంచిర్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘంలో వంద మంది సభ్యులున్న తరుణంలో ఒక్కసారిగా ఎలాంటి పరీక్షలు నిర్వ హించకుండా వైద్యులను, విద్యా సంస్థల నిర్వాహకులను, విద్యార్థులను, ఆర్థికంగా ఉండి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నవారికి ఎందుకు సభ్యత్వం ఇవ్వాల్సి వచ్చిందో ఇచ్చిన వారికే తెలియాలి. 2024 సెప్టెంబర్ 18న సర్వసభ్య సమావేశం నిర్వహించి సొసై టీ తరఫున కల్లు అమ్ముకునేందుకు రెండు సంవత్సరాలకు గుర్రం రాజేందర్ గౌడ్‌కు లీజుకు ఒప్పందం చేసుకున్నారు.
మొదటి సంవత్సరాని(2024)కి సంఘానికి రూ. 12.50 లక్షలు (మొదటి విడత రూ. 6.50 లక్షలు, రెండో విడత రూ.6 లక్షలు)గా తీర్మాణించి కొత్తగా చేర్చిన వారిని కలుపుకొని ఒ క్కొక్కరికి మొదటి విడత రూ.6,500, రెండో విడత రూ.2,200 చెల్లించారు. రెండో ఏడా ది (2025)కి రూ.13.25 లక్షలు (మొదటి వి డత రూ.6.75 లక్షలు, రెండో విడత రూ.6.50 లక్షలు)గా తీర్మాణించారు. కానీ ఈ ఏడాది మొదటి విడతగా రూ.3,000 ఇ స్తున్నట్లు సమాచారం. ఇది ఏ లెక్క ప్రకారం చెల్లిస్తున్నారో ఆ సంఘ పెద్దలకే తెలియాలి.
డబ్బులు తీసుకోని కొత్త సభ్యులు
సొసైటీ తరఫున వచ్చే లాభాలు సభ్యులందరికీ పంచుతుంటారు. కొత్త సభ్యులకు పంచినట్లు లెక్కలు రాసినా.. క్షేత్ర స్థాయిలో చాలామంది తీసుకోనట్లు ‘విజయక్రాంతి’ పరిశీలనలో తెలిసింది. మరి ఆ డబ్బులు ఎవరు మింగారు? కన్వీనర్, గౌరవ సభ్యుల పేరిట నెల నెలా లక్షల రూపాయలు తీసుకుంటున్నా, లీజు ద్వారా వచ్చే డబ్బులను ఎవరి అకౌంట్లో వేసుకున్నారో సంబంధిత శాఖ అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఉన్న సభ్యులెంత మంది, సక్రమంగా పంచుతున్నది ఎంత మందికి అనేది ఎవరికి తెలియని రహస్యం. ఇలా ఏండ్ల తరబడి నడుస్తున్న ఈ వ్యవహారంలో ఎన్ని లక్షలు లోపలేసుకున్నారనేది అధికారులు సక్రమంగా ఆడిట్ నిర్వహిస్తే వెలుగుచూసే అవకాశం ఉంది. అధికారులు ఆమ్యామ్యాలకు ఆశపడినంత కాలం ఇలాంటి అవినీతి, అక్రమాలు జరుగుతూనే ఉంటాయని, అమాయక సభ్యులు మోసపోతూనే ఉంటారనడానికి ఒక సభ్యుడు కలెక్టర్‌కు మొర పెట్టుకున్న లేఖనే సాక్ష్యం.