calender_icon.png 30 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క ఓటు లేదు.. అయినా ఎస్టీ రిజర్వేషన్

30-09-2025 01:24:56 AM

  1. కామారెడ్డి జిల్లా అంకోల్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్
  2. ఆందోళన చెందుతున్న ఆశావహులు, గ్రామస్థులు
  3. రిజర్వేషన్ రద్దు చేయాలని కలెక్టరేట్‌లో వినతి

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆ ఊరిలో ఆ వర్గానికి సంబంధిం చిన కుటుంబం లేదు, ఒక్క ఓటు కూడా లేదు. కానీ డ్రా తీయడంతో ఆ గ్రామం సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వేషన్‌కు వచ్చింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పరిస్థితి ఇది. గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేరు, ఎస్టీ కుటుంబం లేదు.. అయినా తమ ఎస్టీ సర్పంచుగా రిజర్వేషన్ కేటాయించడం అన్యాయమని గ్రామస్థులు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి అదనపు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

తమ గ్రామానికి వచ్చిన ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్ రద్దుచేసి ఇతర రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ కావడంతో తాము అవకాశం కోల్పోయామని మొరపెట్టుకున్నారు. ఎస్టీ రిజర్వేషన్ రద్దుచేసి బీసీ, ఎస్సీ, జనరల్ రిజర్వ్ చేయాలని కోరారు. అయితే ఒక్క ఓటు కూడా లేని గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ రావడం తమకు విచిత్రంగా ఉందని తెలిపారు. మాజీ సర్పంచ్ సాయిలు ఈ అంశంపై అదనపు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.