పిల్లలపై కోప్పడితే ఎలా?

27-04-2024 12:10:00 AM

పిల్లలు మారాం చేయటం, మొండిగా మంకుపట్టు పట్టటం సాధారణమే. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఇది చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. కొన్ని సార్లు పిల్లలు ప్రతి చిన్న విషయానికి కోపం ప్రదర్శిస్తుంటారు. వస్తువులను విరగ్గొట్టటం, కిందపడి దొర్లటం దగ్గరనుంచీ పక్కన ఉన్న వాళ్లని గాయపరచటం వరకూ వెళ్తారు. తల్లిదండ్రులతోనే కాదు తమ తోబుట్టువులతోనూ సరిగ్గా వ్యవహరించరు. ఈ తరహా ప్రవర్తన భరించలేని స్థాయికి చేరినప్పుడు పెద్దల కోపం కూడా హద్దులు దాటుతుంది. అయితే ఈ సమస్యని కోపాన్ని ప్రదర్శించి మాత్రం తగ్గించలేము. ఎందుకంటే ఈ హద్దులు లేని మొండితనం మానసిక సమస్య కూడా కావచ్చు. కొన్ని సార్లు దానికి చికిత్స కూడా అవసరం అవుతుంది.

మొండితనం కేవలం బిహేవియర్ సమస్య మాత్రమే కాదు శారీరక లేదా మానసిక సమస్య కూడా కావచ్చు. చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని వారి మొండితనం, అలవాటుగా భావించి వదిలేస్తారు. కానీ, అన్ని సార్లూ అలా విస్మరించటం, అదే తగ్గుతుందిలే అని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఎందుకంటే ఇది పిల్లల ఆరోగ్యంతో పాటు మానసిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లల సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కారణాన్ని బట్టి పిల్లల కోపాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పిల్లలమీద తిరిగి కోపాన్ని ప్రదర్శించటం, కొట్టటం సమస్యని మరింత దిగజారేలా చేస్తుంది.

ముఖ్యంగా ఇంట్లో కమ్యూనికేషన్ ముఖ్యం. కోప్పడితే సాధించొచ్చు, ఏడిస్తే సాధించొచ్చని చిన్నపిల్లలు వాటిని తరచూ ప్రదర్శిస్తుంటారు. అసలు వారి బాధ, కోపం వెనకాల జరిగేదేంటో కూల్‌గా అడగాలి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వాళ్ల ఎమోషన్స్ తెలుసుకొని వారికి సపోర్ట్‌గా తల్లిదండ్రులు ఉంటే పిల్లల ఆలోచనల్లో మార్పు వస్తుంది. కోపం తగ్గుతుంది.

 కొందరు పిల్లలు ఏదైనా విషయంలో కలత చెందితే నేల మీద పడి దొర్లుతారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. అలాంటి పిల్లలతో వ్యవహరించడం అంత సులభం కాదు. అలాంటి పిల్లలతో ఓపికగా వ్యవహరించాలి. వారి ప్రవర్తనను మెల్లగా మార్చాలి. అసలు బిడ్డకు కోపం రావడానికి కారణమేంటో తెలుసుకోవాలి. స్కూలుకు  వెళ్ళే పిల్లలు కొన్నిసార్లు హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్ లాంటి విషయాల్లో ఒత్తిడికి గురవుతారు. అది వారిలో స్కూల్ తప్పించుకోవటానికి ఏదైనా చేయాలన్న ఆలోచన తెస్తుంది. లేదంటే ఆ ఒత్తిడి తమ సాటి పిల్లలని బాధించే దాకా వెళ్లొచ్చు కూడా. కోపాన్ని నియంత్రించడానికి చైల్డ్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది.

సాధారణంగా ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు దానికోసం మంకు పట్టు పట్టడం సహజమే, అది వాళ్లకి ఇవ్వలేనప్పుడు అది ఎందుకు ఇవ్వటం లేదో వాళ్లకి అర్థమయ్యేలా కాస్త ఓపికతో చెప్పాలి. దానికి బదులుగా వాళ్లని సంతోషపెట్టే మార్గం వేరే ఏదైనా చూడాలి. అంతే తప్ప మొదటే కోపంగా కసురుకోవటం పిల్లల్లో మరింత తిరగబడే లక్షణాన్ని పెంచుతుంది. కొంతమంది పిల్లలకు పెద్దలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. అడిగినదానికి సమాధానం చెప్పకపోవడం, ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే ముడుచుకుపోవడం, గట్టిగా మాట్లాడితే ఏడుపు ముఖం పెట్టడం వంటి లక్షణాలు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఇవేమీ పెద్ద విషయాలు కావు. బాల్యం నుండి వాళ్లుపెరిగిన వాతావరణం అలా ప్రవర్తించేలా చేస్తుంది. లోలోపల ఉండే భయం, సిగ్గరితనం కూడా పిల్లలని అభద్రతా భావానికి గురి చేస్తుంది. దానితో పిల్లలు ఇతరులతో కలవటానికి ఇష్టం చూపించరు. ఈ ఒంటరితనం వాళ్లలో తెలియని అసహనాన్ని, కోపాన్ని పెంచుతుంది. 

కోపంగా, మొండిగా ఉన్నప్పుడు వారిని శాంతింపజేయడానికి వీపుపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటే పిల్లల కోపం చాలా తగ్గుతుంది. కాస్త పెద్ద పిల్లలైతే వారి కోపాన్ని నియంత్రించేందుకు వారితో కాసేపు మాట్లాడాలి, ప్రశాంతంగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వాలి. చాలావరకూ దీనితో సమస్య తగ్గుతుంది. 

కోపం వద్దు.. ఓపికగా వినండి

పిల్లలు ఒత్తిడి సమయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు. కొందరు పిల్లలు మొండిగా, మరికొందరు ఆవేశంతో వ్యవహరిస్తారు, ఇంకొందరు మానసికంగా కుంగిపోతారు. కొందరు పిల్లలు మౌనంగా ఉండిపోతారు. అందువల్ల పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. ఏదైనా సమస్య వచ్చినా తల్లిదండ్రుల దగ్గర దాచాల్సిన అవసరం ఉండదని వాళ్లకి తెలిసేలా చెప్పాలి. కోప్పడటం, కొట్టడంలాంటివి చేసినప్పుడు పిల్లలు తమ సమస్యని నేరుగా చెప్పటానికి భయపడతారు. ఆ ఒత్తిడిలోనే వాళ్లు మరింత మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు చెప్పేది ఓపికగా విని అర్థం చేసుకోవటమే చాలా సమస్యలకు పరిష్కారం. 

పిల్లల కోపాన్ని అదుపులో ఉంచాలంటే ముందుగా కోపానికి గల కారణాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.

పిల్లలు ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటే, వారిని కాసేపు ఒంటరిగా వదిలేయాలి. ఆ తరువాత కూడా అలాగే ఉండకుండా నెమ్మదిగా మాటల్లోకి దించి నవ్విస్తే మళ్లీ మామూలుగా అయిపోతారు.

స్కూల్‌లో స్నేహితుల నుండి విడిపోవడం లేదా ఇల్లు మారడం వల్ల కూడా పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది, అందుకే ఇల్లు మారినప్పుడు, కొత్త ప్రదేశాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కొత్త వారితో స్నేహం చేయడంలో సహాయపడాలి.

పిల్లలని నొప్పికలిగేంతలా కొట్టడం, ఉలిక్కిప డేలా అరవటం చెయ్యవద్దు. కోపాన్ని అతి తక్కువగా, వీలైనంత సున్నితంగా ప్రదర్శించాలి. 

ఒక్కోసారి న్యూరోలాజికల్ డిజార్డర్ వల్ల పిల్లలకు కోపం ఎక్కువ వచ్చినా తల్లిదండ్రులకు ఈ సమస్య అర్థం కాదు. పిల్లల్లో కోపం ఆటిజం, ఆస్పెర్జర్స్ సిండ్రోమ్ , టూరెట్ సిండ్రోమ్ వల్ల వస్తుంది. దీని కారణంగా పిల్లలకి తలనొప్పి , విశ్రాంతి లేకపోవడం కూడా ఉండవచ్చు.

మానసికంగా కుంగి పోతున్నారని అనిపించినా, పిల్లలలో విపరీత ప్రవర్తన పెరుగు తోందని అనిపించినా. ఆలస్యం చేయకుండా కౌన్సిలర్‌ని కలవటం చాలా అవసరం.

కుమార్