02-05-2025 01:34:26 AM
హైదరాబాద్, మే 1: గ్రూప్ మెయిన్స్ పరీక్షల్లో తెలుగులో జవాబులు రాసిన అభ్యర్థులకు మార్కులు ఏ విధంగా కేటాయిం చారని టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఆయా సబ్జెక్టుల నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని కోర్టు కు టీజీపీఎస్సీ వివరించింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని, మరోసారి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. మెయిన్స్‌లో అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందో టీజీపీఎస్సీ స్పష్టత ఇవ్వలేదన్నారు.
కోఠి కేంద్రంలో ఎంపిక చేసుకున్న మహిళలే పరీక్ష రాశారని, నోటిఫికేషన్‌లో మహిళా సెంటర్ అని ఎక్కడా పేర్కొనలేదని, గతంలో కోఠి కాలేజీలో పురుష అభ్యర్థులు కూడా పరీక్షలు రాశారన్నారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే మహి ళా సెంటర్ అని చేర్చారన్నారు. ఎంపిక చేసుకున్నవారికి మేలు జరిగేందుకు ఇలా చేశార న్నారు. అలాగే సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోర్టును కోరారు.