28-07-2025 10:54:18 PM
ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్..
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసిపి కార్మికులకు రావాల్సిన ఇంటి అద్దె(హెచ్ఆర్ఏ) చెల్లింపుపై గత స్ట్రక్చరల్ సమావేశంలో యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించడం జరిగిందని గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్(AITUC branch vice president Bheemanadhuni Sudarshan) తెలిపారు. సోమవారం కేకే ఓసిపిపై యూనియన్ పిట్ కార్యదర్శి మర్రి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక కారణాలతో హెచ్ఆర్ఎ చెల్లింపు ఆలస్యం అవుతుందని త్వరలోనే కార్మికులకు చెల్లించడం జరుగుతుందన్నారు. సింగరేణికి గత ఆర్థిక సంవత్సరం 2024-25 లో వచ్చిన వాస్తవ లాభాల నుండి కార్మికులకు 35 శాతం లాభాల వాటా ఇప్పించడానికి యూనియన్ కేంద్రనాయకత్వం యాజమాన్యంతో చర్చించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా పెర్క్స్ పై ఐటి రద్దు చేయాలని, కార్మికులకు సొంతింటి పథకం కల్పించాలని యూనియన్ నాయకత్వం కృషి చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా స్టృక్చరల్ సమావేశాలు లేవని, ఏఐటీయూసీ గెలిచిన అనంతరం ఏరియాలో జిఎం స్థాయి స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి, ఏరియాలోని పలు సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి, పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జెట్టి మల్లయ్య, బ్రాంచ్ నాయకులు రాజేశ్వర్, బానయ్య, కేకే 5 గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ కుమార్, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ గోపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు ముద్దసాని కోటయ్య, ఓసిపి అసిస్టెంట్ పిట్ కార్యదర్శి రాజేష్ యాదవ్, షిఫ్ట్ ఇంచార్జ్ పల్లపు మల్లేష్, ఓసిపి మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.