10-11-2025 12:00:00 AM
మూడురోజులుగా లయతప్పక కురిసి
గుండెలు బరువెక్కిస్తుంది వర్షం
ఊరికి దూరంగా వెలేసినట్టు ఒంటరిచెట్టు
గుండెల్లో కూలిపోడానికి సిద్ధంగా ఉన్న
పాతబంగ్లాలా పక్షిగూడు
పిల్లల్ని ఆకలి కొండచిలువలా మింగుతుంటే
తల్లి నిస్సహాయంగా రెక్కలు కప్పింది
ఆకాశానికి భూమికి యుద్ధం వచ్చినట్టు
కారుమేఘాలు ప్రళయ గర్జన చేస్తూ
చినుకుల్ని నేలపైకి సంధిస్తున్నాయి
పచ్చరంగు ఒలికిపోయినట్టు
ప్రకృతి తడిసి ముద్దయి
మట్టి కొత్త పురుళ్లు పోసుకుంటున్నది
యుద్ధవిరామంలా వర్షం ఆగడంతో
నేల ఊపిరి పీల్చుకుంటోంది
పక్షులు సూర్యుడొచ్చాడని అరుస్తున్నాయి
రవి తేజస్సుకు నల్లమేఘాలు
తలలు దించుకుని తప్పుకొంటున్నాయి
నింగీనేల చెట్టూ పుట్ట పక్షీ పురుగూ
చైతన్యంతో తొణికిసలాడుతున్నాయ్ !
తల్లిపక్షి ఈకల్లో నాటుకొన్న చినుకు బాణాల్ని
విదిలించటానికి రెక్కలల్లార్చి
మళ్లీ ఆకలి పోరాటానికి సిద్ధపడింది
పిల్లల ఆకలి తీర్చడం తల్లి కర్తవ్యం
భీమవరపు పురుషోత్తమ్