09-11-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
ఏడు దశాబ్దాలుగా తెలుగు నేలపైన తమ దశాబ్దాల వెనుకబాటు తనంపై బలహీన వర్గాలు సంఘటిత ఉద్యమాలు చేసిన దాఖలాలు కనపడవు. కానీ జన గణనలో భాగంగా కులగణన జరగాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ర్టంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఎదు రవుతున్న అడ్డంకులు బలహీన వర్గాల్లో చైతన్యం నింపడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి దోహదపడింది.
దీనితో పాటు బలహీన వర్గాల ఉద్యమానికి తెలంగాణ రాష్ర్టం ఒక వేదికగా మారినట్లుగా కనిపిస్తున్నది. రాష్ర్టంలో బీసీల కేంద్రంగా ఒక రాజకీయ అనివార్యత ఏర్పడింది కాబ ట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నేటి రిజర్వేషన్ల సాధన కోసం తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’ వరకు..
ఇష్టమున్నా, లేకపోయినా అన్ని రాజకీయ పార్టీలు బీసీ వర్గాలను విస్మరించి రాజకీయాలు చేయలేమన్న పరిస్థితుల్లో బీసీ నినాదం ఎత్తుకో వలసిన ఆవశ్యకత ఏర్పడింది. కులగణన రిజర్వేషన్ల అంశాలు బీసీ సమాజాన్ని చైతన్య పరచడమే కాదు.. బీసీలు సగం, బీసీలకు సగం, ఆర్థికంలో సగం, అవకాశా ల్లో సగం, ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో పాలకులపై వాటా కోసం వార్ మొదలుపెట్టినట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.
అధికారంలో వాటా కోసం..
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కావొచ్చు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత కానీ.. అత్యధిక శాతం ఉన్న బలహీన వర్గాలకు అధికారం దక్కకపోగా అధికారిక పదవుల్లో సరైన వాటా కూడా దక్కలేదు. ఈ ఏడు దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాలను 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అందులో 17 మంది అగ్రవర్ణాలకు చెంది న వారే. ఒక్క దామోదర సంజీవయ్య మాత్రమే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీఎంగా అవకాశం దక్కించుకున్నారు.
అగ్రవర్ణాలలోని ఒక్క సామాజిక వర్గం నుంచి తొమ్మిది మంది ముఖ్యమంత్రులయితే.. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఇక పది మంది ఉప ముఖ్య మంత్రులయితే.. 1982లో సి. జగన్నాధరావు ముదిరాజ్‌కు మాత్రమే ఉపముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత నలుగురికి ఉప ముఖ్యమంత్రులు గా అవకాశం దక్కితే అందులో ఒక్కరు కూడా బీసీ నాయకులు లేకపోవడం బాధాకరం.
బీసీలకు అధికారం దక్కకపో గా, అధికారంలో జనాభా ప్రాతిపదికన సరైన వాటా కూడా దక్కలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో బీసీలకు సముచితమైన ప్రాధాన్యత దక్కుతుంటే.. తెలంగాణలో మాత్రం మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కడం లేదు. జనాభా దామాషా ప్రకారంగా మం త్రివర్గంలో బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు దక్కాలి. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో 4 మంత్రి పదవులు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం మూడే మంత్రి పదవులు దక్కాయి.
తెలంగాణ శాసనసభలో సహజంగా బీసీ వర్గాల నుంచి 50 నుంచి 60 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ పట్టుమని పాతిక మందికి కూడా శాసనసభలో ప్రాతినిధ్యం దక్కడం లేదు. బీసీల ప్రాతినిధ్యం 23 శాసనసభ స్థానాల నుంచి 19 శాసనసభ స్థానాలకు పడిపోవడమే కాకుండా అధికార పార్టీ నుంచి కేవలం ఎనిమిది మంది బీసీ శాసనసభ్యులు మాత్రమే గెలిచారంటే బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించిన అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ చ్చు.
శాసనసభలో 18 శాతం ఉన్న అగ్రవర్ణాలు 58 శాతం ప్రాతినిధ్యం దక్కించుకుం టే.. 56 శాతం ఉన్న బీసీలు కేవలం 16 శాతం ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. 17 మంది ఎంపీల్లో బీసీలు ముగ్గురే కాగా.. 40 మంది ఎమ్మెల్సీల్లో బీసీలు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు.
ఇక నామినేటె డ్ కార్పొరేషన్ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత తక్కువే. బీసీల్లో కూడా ఎంబీసీలకు, సంచార జాతులకు ఎక్కడా అవకా శమే లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎంబీసీ శాసనసభ్యుడికి మంత్రి పదవి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. గత అణిచివేతకు వ్యతిరేకంగా బీసీలు అధికారంలో వాటా కోసం గళం విప్పుతున్నట్లు అనిపిస్తుంది.
ఆర్థికంలో వాటా కోసం..
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 11 బడ్జెట్‌లలో బలహీన వర్గాల సంక్షేమానికి కేటాయించి న నిధులు చాలా తక్కువ. కానీ ఆ కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనే చెప్పాలి. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లు ప్రవేశపెడుతున్నా 56 శాతం ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు మూ డు శాతం కూడా దాటడం లేదు.
తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని కాంగ్రె స్ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌లో 9,300 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్‌లో 11,300 కోట్ల రూపాయలు అంటే మొత్తం బడ్జెట్‌లో 3.2 శాతం నిధులు, ఇచ్చిన హామీలో సగటున సగం నిధులను మాత్రమే కేటాయించి గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ కూడా బీసీలను మోసం చేసింద నే అభిప్రాయం కలగక మానదు.
ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 47 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయడంలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు, కుల ఫెడరేషన్లకు నిధులు కేటాయించడంలో.. కేటాయించిన నిధుల ను ఖర్చు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
రిజర్వేషన్ల అమలు సహా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బలహీన వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం ఇప్పటివరకు నిలబెట్టుకోలేకపోయింది. బీసీ సబ్ ప్లాన్, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు లాంటి కీలక మైన హామీల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనిపించింది.
సంచార జాతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్థికపరమైన, న్యాయమైన వాటా దక్కించుకోవడానికి బీసీలు ఉద్యమబాట పట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. బీసీ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగా పూలే విదే శీ విద్యాజ్యోతి పథకం ద్వారా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థుల సంఖ్యను ప్రతీ సంవత్సరం 300 నుంచి 700కు పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది.
రిజర్వేషన్ల వాటా కోసం..
స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎదురవుతున్న అడ్డంకుల దృష్ట్యా రిజర్వేషన్ల సాధ న కోసం బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించటానికి సిద్ధపడుతున్నట్లుగానే కనిపిస్తున్న ది. రిజర్వేషన్ల సాధన కోసం ‘బంద్ ఫర్ జస్టిస్’తో ప్రారంభమైన ఉద్యమం.. రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమ కార్యాచర ణను ప్రకటించి వివిధ రూపాల్లో ఉద్యమా న్ని కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తర్వాత విద్యా ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యా యం జరుగుతుందనే అభిప్రాయం బలపడుతుంది. కాబట్టి బీసీలకు న్యాయం జర గాలంటే రిజర్వేషన్లు పెరగాలనే బలమైన ఆకాంక్ష తెరపైకి వస్తుంది. తెలంగాణలో 18 కులాలు, 18 శాతమున్న అగ్రవర్ణాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంటే.. 137 కులాలు, 56 శాతం ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 29 శాతం రిజర్వేషన్లు ఏంటన్నది ప్రశ్నగా మిగిలిపో యింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు అడ్డుపడుతున్న వైనం ఒక రకంగా వాటా సాధన కోసం బీసీలను ఉద్యమ బాట పట్టేందుకు దోహదం చేసిందని చెప్పొచ్చు. వెనుకబాటుతనంపై తిరుగుబాటు బలహీన వర్గాల మెదడుల నుంచి ప్రారంభం కావాలని బీపీ మండల్ చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ర్టంలో బలహీనవర్గాలు వాటా కోసం వార్ మొదలు పెట్టినట్లుగానే కనిపిస్తుంది.
- వ్యాసకర్త సెల్: 9885465877