05-07-2025 12:31:03 AM
మేడ్చల్ అర్బన్, జూలై 4: అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబుతో ప్రశాంతి (22) వివాహం ఏడాదిన్నర కిందట జరిగింది. రాంబాబు వృత్తి రీత్యా మేస్త్రీగా పని చేస్తున్నాడు.
నెల నుంచిమేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్-ఎన్జేఆర్ నగర్లో అద్దెకు ఉంటున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి రాంబాబు, ప్రశాంతిని అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ విషయమై తరుచుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. కుటుంబ పెద్దలు ఇరువురికి నచ్చచెపుతూ వచ్చారు. పాప పుట్టిన తర్వాత అయినా రాంబాబు మారకపోతాడా అని భావించారు. అయితే అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు.
ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరిగి, రాంబాబు భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. చనిపోయిందని గుర్తించాక ఐదు నెలల పాపను అక్కడే వదిలేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం బంధువులు రాంబాబుకి ఫోన్ చేయగా ఫోన్ స్విఛాప్ వచ్చింది. దీంతో వారు ఇంటికి వచ్చి చూసేసరికి ప్రశాంతి విగత జీవిగా ఉంది. ఐదు నెలల పాప పక్కన ఏడుస్తూ కనిపించింది.
వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. కేఎల్‌ఆర్-ఎన్జేఆర్నగర్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని సందర్శించామని ఏ సి పి శంకర్ రెడ్డి తెలిపారు.
అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే గురువారం ఇరువురి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుందన్నారు. భార్య గొంతుపైన ఉన్న గుర్తులను బట్టి భర్త గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామన్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించామని తెలిపారు.