21-11-2025 12:09:06 AM
-అనుమానంతోనే ఘాతుకం
-ఖమ్మం నగరంలో దారుణం
ఖమ్మం, నవంబరు 20 (విజయక్రాంతి): అనుమానంతో భార్యను గొంతు కోసి చంపిన ఘటన ఖమ్మంలో పట్టణంలో కలకలం రేపింది. చింతకాని మండలం నేరేడ గ్రామానికి చెందిన జి భాస్కర్ అనే వ్యక్తికి, జగ్గయ్యపేట మండలం తొర్రగుంట పాలెం గ్రామానికి చెందిన సాయివాణి(33)తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి హర్షవర్ధిని, హేమేంద్ర లక్ష్మీనరసింహ సంతానం. భాస్కర్ అనుమానంతో తరచూ వేధిస్తుంటంతో దంపతుల మధ్య కలహాలు జరిగేవి.
భర్త వేధింపులు తట్టుకోలేని సాయివాణి ఆరు నెలల కిందట భర్తకు దూరంగా, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం పట్టణ మున్సిపాలిటీ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆ ఇంటికి భాస్కర్ బుధవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయి, గురువారం ఉదయం వచ్చాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత మార్చాడు. అడ్డుకోబోయని హర్షవర్ధనిపై కూడా దాడి చేయడంతో మూడు వేళ్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఖమ్మం రెండో పట్టణ సీఐ బాలకృష్ణ తెలిపారు.