30-10-2025 01:53:25 AM
-31 నుంచి నవంబర్ 9 వరకు షెడ్యూల్ ఖరారు
-రోడ్ షోలతో నియోజకవర్గాన్ని చుట్టేయనున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంపై బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ దిశగా ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజ కవర్గాన్ని చుట్టేయనున్నారు. జూబ్లీహిల్స్‌లో వరుస రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసి బుధవారం ప్రకటించారు. శుక్రవారం నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గవ్యాప్తంగా కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేయను న్నారు. వరుసగా పది రోజులపాటు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొననున్నారు.
కేటీఆర్ షెడ్యూల్ వివరాలు..
- అక్టోబర్ 31న షేక్‌పేట్
- నవంబర్ 1న రెహమత్‌నగర్
- నవంబర్ 2న యూసుఫ్‌గూడ
- నవంబర్ 3న బోరబండ
- నవంబర్ 4న సోమాజిగూడ
- నవంబర్ 5న వెంగళరావునగర్
- నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్
- నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్‌నగర్
- నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీ
ఆర్టీసీ చార్జీల పెంపు ప్రజలకు భారం కాదా?
-మహిళలకు ఉచితం, పురుషులకు రెట్టింపు చార్జీలు
-ఎక్స్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, పురుషులకు టికెట్ ధరలు పెంచడం కుటుంబాలకు భారం కాదా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బుధవారం ఓ నెటిజన్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సదరు నెటిజన్ పోస్టు చేస్తూ తెలంగాణలో ఆర్టీసీ ఇక ఏమాత్రం అందుబాటులో లేదని, బీటెక్ మొదటి సంవత్సరంలో తాను వెళ్లే గమ్యస్థానానికి బస్ టికెట్ ధర రూ.30గా ఉంటే మూడో సంవత్సరం వచ్చేసరికి ఇప్పుడు రూ.60కి పెరిగిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే కానీ పురుషులకు ఎందుకు టికెట్ ధర పెంచుతున్నారని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ పురుషులకు రెట్టింపు చార్జీలు విధిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల బస్ పాసులపై 25 శాతం చార్జీలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కిస్తే ఇదంతా కుటుంబాలపై పెరిగిన భారం కాదా అని నిలదీశారు.