10-07-2025 01:17:16 AM
- వంద శాంపిల్స్ డీఎన్‌ఏలో తేలని వైనం
- వారంతా మృతిచెందారు
- సిగాచీ ఘటనపై అధికారుల ప్రకటన
- మొత్తం 52కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి): పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల అవశేషాలు లభించడం కష్టమేనని, వారు కూడా ప్రమాదంలో మృతిచెంది ఉంటారని అధికారులు బుధవారం నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 44 మంది మృతి చెందిన విష యం తెలిసిందే. ఆచూకీ లభించని 8 కూడా మృతిచెందారని నిర్ధారించడంతో మొత్తం మృతుల సంఖ్యల 52కు చేరింది.
ఆచూకీ లభించని 8 మందిలో రాహుల్, వెంకటేశ్, శివాజీ, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ మృతి చెందినట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా వారికి సంబంధించిన అవశేషాలు లభించలేదు. గత రెండు రోజుల క్రితం సుమారు వంద శాంపిల్స్‌ను సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపించగా జాడలేని కార్మికుల కుటుం బీకులతో సరిపోకపోవడంతో అధికారులు నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ అవశేషాలు లభిస్తాయేమోనని రెస్క్యూ బృందం వెతికినప్పటికీ లాభం లేకుండా పోయింది.
అయితే వారంతా అగ్నికీలలకు ఎముకలు కూడా మిగలకుండా బూడిదైనట్లుగా భావిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థి తుల్లో వారు మృతి చెందినట్లు నిర్ధారించి కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. బాధిత కుటుంబాలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని కోరారు. తమవంతు ప్రయత్నంగా ఇంకా డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగిస్తామని, ఏదైనా సమాచారం అందితే కుటుంబీకులకు తెలియజే స్తామని చెపుతున్నారు.
సిగాచీ మిగిల్చిన విషాదం
సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. కంపెనీలో పనికి వెళ్లిన తమవారికి అదే చివరి రోజవుతుందని భావించలేదు. భార్యా, పిల్లలకు అదే కడసారి చూపు అని తెలియదు. ఎవరి లోపమో.. ఎవరి పాపమో తెలియదు గానీ మొత్తం 52 మంది అగ్నిజ్వాలలకు ఆహుతయ్యారు. 8 మంది కార్మికుల కనీసం అవశేషాలు కూడా లభించకపోవడం వారి కుటుంబీకుల రోధన వర్ణణాతీతం. పది రోజులుగా తమవారి జాడ తెలుస్తుందేమోనని ఎదురుచూసిన వారికి బూడిద కూడా దక్కలేదు. ఇకవారు మృతి చెందినట్లేనని అధికారులు నిర్ధారించడంతో అంత్యక్రియలకు ఎముక కూడా దక్కలేదని కన్నీరుము న్నీరవుతున్నారు. బరువెక్కిన గుండెతో.. సిగాచి మిగిల్చిన విషాదంతో మృతుల కుటుంబీకులు తమ స్వస్థలాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం
ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు బుధవారం ఒక్కొ క్కరికి కంపెనీ యాజమాన్యం తరపున రూ.15 లక్షల పరిహారం చెక్కులను అందజేసినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే వారి స్వస్థలాలకు వెళ్లడానికి రూ.10వేలు అందించినట్లు చెప్పారు.