18-10-2025 12:11:52 AM
కుల్సుంపురాలో రూ.110 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
కబ్జాదారుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 8కి పైగా కేసులు
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. కోర్టు తీర్పుతో శుక్రవారం రంగంలోకి దిగిన హైడ్రా గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. సుమారు 1.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.110 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కుల్సుంపురాలోని ఈ ప్రభుత్వ భూమిని ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం గతంలోనే భావించింది. అయితే, అశోక్ సింగ్ అనే వ్యక్తి ఈ భూమి తనదేనంటూ కబ్జా చేశాడు. ఇందులో అక్రమంగా షెడ్లు నిర్మించి విగ్రహ తయారీదారులకు అద్దెకు ఇస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నాడు. ఈ భూ వివాదంపై సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో రెండుసార్లు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించగా, అశోక్ సింగ్ వారిపై దాడులకు పాల్ప డి అడ్డుకున్నాడు.
అతనిపై లంగర్‌హౌస్, మంగళ్‌హాట్, శాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో మొత్తం కలిపి 8కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో, శుక్రవారం హైడ్రా బృందం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది. కబ్జాదారుడు నిర్మించిన అక్ర మ షెడ్లను, ఇతర కట్టడాలను పూర్తిగా కూల్చివేసి, 1.30 ఎకరాలను ఆధీనంలోకి తీసుకుం ది. అనంతరం ఆ స్థలం చుట్టూ కం చె వేసి, ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూము లను కబ్జా చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు మరోసారి హెచ్చరించారు.