19-01-2026 12:00:00 AM
విమర్శల శూలాలను
గుచ్చుకున్న దేహం నుంచీ
నా గేయపు వ్యాకరణం
రూపుదాల్చుతోంది
నేనొక దిగంబర బైరాగిని
రాజ్యం నుంచి మరో రాజ్యానికి
వలసపోయే దేశ దిమ్మరినీ
గుండెను పిండే వస్తువు దొరికితే
పీలికలు పీలికలు చేసీ
అందులో నిండారా నివసిస్తాను
దోపిడి చీకటి గుహలో చిక్కిన
దీనజనం నన్ను ఆహ్వానించే బలగం
రాత్రంతా నిద్రపోకుండా
అక్షర అల్లిక సాలీడులా
ఓ కబంధ ఆచ్ఛాదనను పెనవేకుంటాను
వరదలో మునిగి బురదలో తునిగి
కుంటి కునారిల్లుతున్న ఊరు పైనో..
ఇల్లంతా కూల్చబడి రోడ్డున పడ్డ
రోధక మనుసుపైనో కప్పి
మండుతున్న ఆకలిని తీర్చుకుంటాను
అశ్రువులే లేని దీర్ఘ ఏడుపుల మీద
నా కవన పవనాలు ప్రయాణం చేస్తుంటాయి
భల్లున ప్రపంచ ముఖంపై కురుస్తాను!
బతుకు చివరి అంకాన్ని
లెక్కపెట్టుకుంటున్న
ఊపిరి ఉచ్ఛ్వాసాలే ప్రాణంగా
నా పంక్తులు తాండవం చేస్తాయి
స్మశాన నిశ్శబ్దం నుంచి ఫట్ మని పేలుతున్న
కాలధర్మ కర్మకాండల సహజ
నిట్టూర్పుల వలయం నా చుట్టూ...
అక్షర అగ్నిశిఖల మధ్య వాలి.. కాలీ
నన్ను నేను పుటం పెట్టుకుంటూ
చిట్ట చివరి బూడిదను హత్తుకునే
నేనొక అనామక అఘోరానూ !