19-01-2026 12:00:00 AM
కొన్ని మాటలకు
మౌనం తప్ప సమాధానం ఉండదు
కొందరి మాటలు
కళ్లు చెమ్మగింపజేస్తాయి !
పూల పలుకులు
వాన చినుకుల ఉపశమనాలవుతాయి!
మంత్ర పూల స్పర్శతో
రాళ్ళు దేవుళ్లవుతారు
సత్యభాషణాల లోకం
జెండా జేజేలు అందుకుంటూ
ఉంటుంది !
గుండె చప్పుల్లతో మాట్లాడే
తల్లులందరూ వాగ్దేవిలవుతారు
పిల్లలకు స్తన్యాలిచ్చిన అమ్మలవుతారు !
పూల చూపులు కూడా
పూల మాటలే !
పూల రూపాలు కూడా
మూగ మాటలే !
జలాల్లో నేడు పూలు
మాట్లాడడం లేదు
చమురు మాటలతో
పూల వనాలని దహించివేస్తుంది జగతి!
పూల బాసల ఎంకి గొంతు
మూగబోయింది!
పైసా బానిసల ఎగతాళికి !
తెరల తెరల
మంచు కళా దుఃఖాలని
ముఖాల మీద పులుముతున్నారు !
చెమ్మలు నింపే
పూల బాసలకి సలాములు !
గుండెల్లో దమ్ములు నింపే
సత్యవాక్కులకు దండాలు !