26-05-2025 12:00:00 AM
సాయంసంధ్యలో
పొలం గట్టున అలా నడుస్తుంటానా..
పిల్ల తెమ్మెర
నా వదనాన్ని చల్లచల్లగా తాకిపోతుంది
గడ్డిపువ్వొకటి
వయ్యారపు చూపు విసురుతుంది
గండు తుమ్మెద
చెవులకు ఝుంకార నాదం వినిపిస్తుంది
పక్షి ఒకటి
గాలిలో గిరికీలు కొడుతూ పలకరిస్తుంది
చేపపిల్ల
కాలువ నీటిలో టపటపలాడి
తొంగి చూస్తుంది
పచ్చని పంట
రేపటి ఆకలికి భరోసాగా తలలూపుతుంది
నీరు కావడికాడొకడు
దూరం నుంచి ఎవరెహె అని అరుస్తుంటాడు
నేను మాత్రం
అరుణిమనద్దుకున్న సూర్యుడిని చూస్తూ
దిగంతాల వైపు నడుస్తుంటాను
గుండుల్లో ప్రకృతిని నింపుకొంటూ
ప్రకృతిలో నన్ను నేను వొంపుకొంటూ..