calender_icon.png 20 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి

20-11-2025 12:00:00 AM

  1. ఐదు రోజులు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు
  2. ఏడేళ్లుగా పైరసీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు గుర్తింపు
  3. రూ.3 కోట్ల నగదు, వందలాది హార్డ్ డిస్క్‌లు ఇప్పటికే స్వాధీనం
  4. విచారణలో అంతర్జాతీయ నెట్‌వర్క్, మిగిలిన నిందితుల వివరాలు బయటకు వచ్చే అవకాశం
  5. రవి అరెస్ట్‌పై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 19 (విజయక్రాంతి) : తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ పైరసీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.  అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న అతడిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు దాఖ లు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది.

ఏడేళ్లుగా పైరసీ సామ్రాజ్యం 

కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీలలోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని గత శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడేళ్లుగా ఇమ్మడి రవి ‘ఐబొమ్మ’, ‘బప్పమ్’, ‘ఐ విన్’, ‘ఐ రాధా టీవీ’ వంటి అనేక పేర్లతో వెబ్‌సైట్లను సృష్టిస్తూ, పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేదికగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసి రూ.3 కోట్ల నగదు, వందలాది హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

టికెట్ రేట్లే కారణం.. నిర్మాత చదలవాడ

‘ఐబొమ్మ’ రవి అరెస్ట్‌పై సినీ పరిశ్రమలో భిన్రాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లు రూ.1000కి పెంచడం వల్లే ప్రేక్షకులు ‘ఐబొమ్మ’ లాంటి వెబ్‌సైట్లలో సినిమాలు చూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో 90 శాతం బడ్జెట్ ఒకరిద్దరి రెమ్యునరేషన్లకే పోతోంది. ఆ భారం టికెట్లపై పడుతోంది. అప్పుడు సగటు ప్రేక్షకుడు దొంగదారిన సినిమాలు చూస్తాడు. పైరసీ క్యూబ్, వీఎఫ్‌ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచే బయటకు వెళ్తోంది, నిర్మాతలు ముందు వాటిపై దృష్టిపెట్టాలి, అని ఆయన వ్యాఖ్యానించారు.

రవి టాలెంటెడ్ : నటుడు శివాజీ

అయితే, అనూహ్యంగా నటుడు శివాజీ ‘ఐబొమ్మ’ రవికి మద్దతుగా మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్, మంచి హ్యాకర్ అంట. వాడు నిజంగా దేశానికి ఉపయోగపడగల వ్యక్తి. అతన్ని ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్‌లో వాడుకోవాలి. అతను చేసిన పని దుర్మార్గమైనదే అయినా, అతనిలోని టాలెంట్ గొప్పది. తెలియని వయసు, డబ్బు లేకపోవడం వల్ల అలా చేసి ఉండొచ్చు,అని శివాజీ అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వేల కోట్ల పరిశ్రమను, లక్షలాది మంది జీవితాలను దెబ్బతీసిన వ్యక్తిని ‘టాలెంటెడ్’ అనడమేంటని వారు విమర్శిస్తున్నారు. ఈ భిన్న వాదనల నడుమ, ‘ఐబొమ్మ’ రవి కస్టడీ విచారణతో ఈ కేసులో ఇంకెన్ని కోణాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కస్టడీలో కీలక వివరాలు?

నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఈ పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ము ఖ్యంగా, ఈ పైరసీ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యు లు ఎవరు? అంతర్జాతీయంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? బెట్టిం గ్ యాప్‌లతో ఉన్న లింకులు, ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు? యూజర్ల నుంచి చోరీ చేసిన డేటాను ఎవరికి, ఎలా విక్రయించాడు? పైరసీ ద్వారా సంపాదించిన మిగిలిన ఆస్తుల వివరాలు? వంటి అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ కస్టడీ విచారణతో ‘ఐబొమ్మ’ కేసులో మరి న్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.