25-10-2025 12:02:51 AM
వరుస పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు స్టార్ హీరో ప్రభాస్. ఆయన నుంచి రాబోయే సినిమాల్లో ‘స్పిరిట్’ కూడా ఒక భారీ వెంచర్. తొలి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఈసారి ప్రభాస్‌తో చేతులు కలపడం పట్ల అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్ నిర్మించనున్నారు.
త్రిప్తి డిమ్రి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌తోపాటు ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సీనియర్ నటి కాంచన ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా, ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ మూవీటీమ్ ‘సౌండ్ స్టోరీ’ పేరుతో తాజాగా ఒక ఆడియో టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో విజువల్స్ లేవు.
కానీ ప్రభాస్, ప్రకాశ్‌రాజ్ మధ్య జరిగే బలమైన సంభాషణలు కట్టిపడేశాయి. కథ ప్రకారం, ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కానీ, ఓ కారణం వల్ల రిమాండ్‌లో జైలుకు వెళ్తాడు. అక్కడ జైలర్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్ అతనికి సరైన పాఠం నేర్పించాలని నిర్ణయిస్తాడు.
ఆ సందర్భంలో అతనికి జైలుజెర్సీ ధరించమని ఆదేశిస్తే, ప్రభాస్ కూల్‌గా ‘మిస్టర్ సూపరింటెండెంట్ చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది’ అని చెప్పడం అదిరిపోయింది. ఈ ఒక్క లైన్‌తోనే ప్రభాస్ పాత్ర ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో అర్థమవుతోంది. ప్రకాశ్‌రాజ్ పాత్ర కూడా బలంగా ఉండనుందని తెలుస్తోంది. విజువల్స్ లేకుండా వదిలిన ఈ టీజర్‌తో రెబల్ సౌండ్ పాన్‌వరల్డ్ లెవల్‌లో ప్రతిధ్వనించేలా చేయటం సందీప్‌రెడ్డి వంగకే చెల్లింది.