04-07-2025 12:00:00 AM
అమరావతి, జూలై3(విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణాకు నష్టం లేదని గతంలోనే తాను చెప్పినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి నుంచి ఏటా 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే ఈ నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడుతాయని, నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
ఈ నీటిని వాడుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని గుర్తు చేశారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదన్నారు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తాను ఏనాడు వ్యతిరేకించలేదని, వ్యతిరేకించను కూడా అని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం అయితే ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుపడతారని అభిప్రాయపడ్డారు. బనకచర్లపై మాట్లాడుతున్న వారి అభిప్రాయాలు కరెక్ట్ కాదన్నారు. సమైక్యాంధ్రలో నాడు దేవాదుల ప్రాజెక్టుకు తానే పునాదులు వేశానని ఆయన గుర్తు చేశారు.