calender_icon.png 26 May, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమం కోసం.. ప్లాట్లు అమ్మేశా!

25-05-2025 12:00:00 AM

కామారెడ్డి జిల్లాకు చెందిన జగదీశ్‌యాదవ్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు. స్వరాష్టమే లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తెలంగాణ ఏర్పడితే.. మన ఉద్యోగాలు.. మన బతుకు.. మన చేతిలో ఉంటుందని భావించి ఉన్న డబ్బు, ప్లాట్లు అమ్మేసి ఉద్యమానికి ఊతంగా నిలిచాడు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణలో చివరకు అతనికి మిగిలింది శూన్యమే. పోలీసు కేసులు, అప్పు తప్ప మిగిలింది ఏమిలేదని ఉద్యమ కాలం నాటి పరిస్థితులను విజయక్రాంతితో పంచుకున్నారు.

నాడు ఉద్యమమే ఊపిరిగా పనిచేసినా. రాష్ట్రం వస్తే బతుకు బాగుపడుతుందని అనుకున్నా. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు అమ్ముకుంటేనే పూట గడవని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా బాగా నష్టపోయా. కానీ చివరకు పొగడ్తలు, ప్రశంసలే మిగిలాయి. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయా ఆదుకునే వారు లేరు. ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం తాగునీరు అమ్ముకుంటున్నా. 

తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేశా. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే బతుకులు బాగుపడతాయని ఆశించి 2002 నుంచి2012 వరకు తెలంగాణ ఉద్యమంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నా. కుటుంబాన్ని పక్కనపెట్టి.. పైసలను ఎక్కజేయకుండా.. ఉద్యమం కోసం కేబుల్ డిష్‌ను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తాగు నీటి వ్యాపారం ఇంట్లోనే చేసుకుంటున్న.

కుటుంబ బాధ్యతలు పెరిగిన ఉద్యమం కోసం పనిచేస్తే గుర్తింపు వస్తుందని తనకు భవిష్యత్తు ఉంటుందని ఇంట్లో వాళ్లకు చెప్పి ఉన్న డబ్బంతా ఉద్యమం కోసం ఖర్చు పెట్టా. ప్రతి సభ సమావేశాలకు ప్రజలను తరలించాను. ఉన్న ప్లాట్లు అమ్ముకున్న.

ఉద్యమంలో తిరిగి కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు తనతో పాటు పదిమందిని వెంటేసుకుని వెళ్లాను. కరీంనగర్, వరంగల్, నల్గొండ సభలకు తనతోపాటు మరి కొంతమందిని తరలించా. ‘జగదీష్ అన్న’ పేరు వచ్చింది తప్ప తనకు పదవులు మాత్రం రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు కౌన్సిలర్‌గా పోటీచేసి ఓటమిపాలయ్యాను. మరింత ఆర్థికంగా దెబ్బతిన్నా. 

ఆర్థికంగా నష్టపోయా..

కేటీఆర్ తొలిసారి సిరిసిల్లలో శాసనసభ్యునిగా పోటీ చేసినప్పుడు గంభీరావుపేట మండల ఇన్‌చార్జిగా వ్యవహరించాను. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కామారెడ్డి బ్రిగేడియర్‌గా పనిచేస్తే, నాకు మెదక్ బ్రిగేడియర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమయంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆర్థికంగా నష్టపోయా. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొనని వారికి పదవులు వచ్చాయి.

12 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్న నాకు ఉద్యమ సమయంలో ఉన్న గుర్తింపు అధికారంలోకి వచ్చిన తర్వాత కరువైంది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత నాపై కేసులు మిగిలాయి తప్పా పదవులు రాలేదు. రాష్ట్ర టీఆర్‌ఎస్ కార్యదర్శి కేసిఆర్‌కు పార్టీ పదవి అప్పగించారు. అంతే తప్ప ప్రభుత్వ పదవులు మాత్రం రాక ఆర్థికంగా నష్టపోయాను. 

కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలే.. 

బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి ఉద్యమంలో పాల్గొన్న విషయాలను వివరించాను. ఆదుకుంటామని చెప్పారు. కానీ, అవి హామీలుగానే మిగిలిపోయాయి. స్థానిక నేతలు కొందరు అడ్డుపడటంతోనే నాకు గడ్డు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా.

12 సంవత్సరాలు ఉద్యమం చేస్తే కేసులు ఇబ్బందులే మిగిలాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్‌తో, ఆలె నరేంద్రతో కలిసి పనిచేశా. వాళ్లిద్దరికీ వెన్నుదన్నుగా నిలిచా. నరేంద్ర ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర టెలికాం బోర్డు మెంబర్ పదవి ఇప్పించారు. రెండు సంవత్సరాలు పనిచేశాను. 

                                                                                                                                                                                    -- శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి విజయక్రాంతి

కేసులే మిగిలాయి..

తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, రైలురోకో, బస్సు రోకో, రోడ్ల నిర్బంధం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు నమోదయ్యాయి. నాటి కేసుల్లో నేటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఎత్తివేశారు.

ప్రతి పల్లెలో తిరిగి తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేశాను. తెలంగాణ వస్తే తమ బతుకు బాగుపడుతుందని ఊహించాను. ఇంత దుర్భరంగా మారుతుందని అనుకోలేదు. ఇప్పటికైనా నాయకులు స్పందించి, తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయంగా అండగా ఉండాలని కోరుకుంటున్నా.