25-05-2025 12:00:00 AM
ఉమ్మడి రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డాం. ఆంధ్రా పాలకులు, ఆ ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. మా తర్వాతి తరం పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలని అన్నింటికీ ఓర్చుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశాం. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సహాయ నిరాకరణ, వంటావార్పు ఇలా ఎన్నో రూపాల్లో ఆందోళనలు చేశాం. చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ నాటి తెలంగాణ ఉద్యమపోరును గుర్తు చేసుకున్నారు.
‘అప్పట్లో ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు టీజీవో, నాన్ టీజీవో మేధావుల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. నేను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో లైసెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నా సమయంలో చాలా మంది ఆంధ్ర వాళ్లు ముఖ్యమైన పోస్టుల్లో ఉండేది.
వాళ్లంతా కూడా డిప్యూటేషన్ పేరు మీద తెలంగాణకు వచ్చి ఇక్కడే తిష్ట వేసేది. వివిధ విభాగాల్లో వాళ్లదే హవా అంతా.. ఆ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వాళ్లు’.
ఫ్రీజోన్ పేరుతో..
ఉద్యమ సమయంలో ఫ్రీజోన్ కావడంతో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంతోమంది డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చి ముఖ్యమైన విభాగాల్లో పాతుకుపోయారు. హైదరాబాద్ ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్‌గా చాలామంది వాడుకున్నారు.
ఆంధ్ర అధికారులు తిష్ట వేసిన పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీకి అందజేశాం. తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి.. ఇక్కడి నుంచి పంపించేశాం. ఈ విజయం మాలో ఎంతో పోరాట
స్ఫూర్తిని నింపింది. ఇక అప్పటి నుంచి మా పోరాటాలను మరింత ఉధృతం చేశాం. అప్పట్లో చాలామంది ఆంధ్ర అధికారులు మాపై పక్షపాత ధోరణి చూపించారు. ఉద్యోగ సంఘాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్, విట్టల్, పొన్నం ప్రభాకర్ తదితరుల పిలుపుమేరకు పోరాటం చేశాం.
గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించాం. మా పోరాటం గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశాం. అయితే అధికారులు జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని మొత్తం పోలీసులతో నింపేశారు. అదే సమయంలో
కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఆ ఘటన మమ్మల్ని బాగా కలచివేసింది. మేం నిరసన ఉదృతం చేయడం అరెస్టు చేసి పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉద్యోగులకు పదహారేళ్ల పాటు ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో మేమంతా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ విషయంపై మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సహాయ నిరాకరణ, పెన్ డౌన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. మిలియన్ మార్చ్ కార్యక్రమం ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చింది.
మా లక్ష్యం నెరవేరింది!
మా నిరసనలకు పొన్నం ప్రభాకర్, జానా రెడ్డి, మధు యాష్కి తదితరులు సాయంగా నిలిచారు. మేం అనుకున్న లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాయి. తరువాత తరం బాగుండాలని పోరాటం చేశాం. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలు బాగా జరుగుతున్నాయి. మా లక్ష్యం నెరవేరింది.
విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి పోరాటం చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమంలో నేను భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారులు అందరికీ ప్రమోషన్లు వచ్చాయి.
బర్క ప్రవీణ్ యాదవ్, రాజేంద్రనగర్