calender_icon.png 8 July, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ టారిఫ్ హెచ్చరిక

08-07-2025 12:00:00 AM

బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకం

  1. అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని ఆరోపణ

సుంకాల పోరులో విజేతలు ఉండరన్న చైనా

ట్రంప్ నిర్ణయంపై బ్రిక్స్ దేశాల ఆందోళన

వాషింగ్టన్, జూలై 7: అమెరికా, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం  తీవ్ర రూపం దాల్చింది. సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. బ్రిక్స్ కూటమి అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్ను నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు పెట్టారు. ‘అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఈ విషయంపై మీరంతా దృష్టి సారించినందుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ కొత్త సుంకాల విధానానికి సంబంధించిన అధికారిక లేఖలను సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వివిధ దేశాలకు పంపనున్నట్టు మరో సందేశంలో తెలిపారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. సుంకాల పోరులో ఎవరూ విజేతగా నిలవరని చైనా పేర్కొంది.

రియో డి జెనిరోలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో అమెరికా ఏకపక్ష సుంకాలను పెంచడంపై బ్రిక్స్ దేశాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా, విచక్షణారహితంగా సుంకాలను పెంచడం, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 

ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదు: చైనా

ట్రంప్ చేసిన హెచ్చరికలపై చైనా స్పందించింది. బ్రిక్స్ గ్రూప్ ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. టారిఫ్ విధింపు విషయంలో తమ స్పందనంలో ఏ మార్పు లేదని.. అయితే సుంకాల పోరులో ఎవరూ విజేతలుగా నిలవరని తెలిపింది.  తాము ఘర్షణను కోరుకోవడం లేదని చైనా పునరుద్ఘాటించింది. రక్షణాత్మక వైఖరితో ముందుకెళ్లలేమని స్పష్టం చేసింది.

వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం చైనా, అమెరికాల మధ్య టారిఫ్ వార్ నడిచింది. ఆ తర్వాత ఒప్పందంతో రెండు దేశా ల మధ్య సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆటలు ఆడా లనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని గతంలో ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

రియో డి జెనిరోలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. బ్రెజిల్, రష్యా, భారత్,చైనా, దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూ ఏ ఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా సభ్య దేశాలుగా చేరాయి.