24-07-2025 01:18:43 AM
28న విచారణకు హాజరవుతా
సిట్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ సీరియస్
సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ నెల 24 సిట్ విచారణకు హాజరు కావాల్సిన కేంద్రమంత్రి బండి సంజయ్.. పార్లమెంట్ సమా వేశాల దృష్ట్యా హాజరుకాలేనంటూ బుధవారం సిట్‌కు లేఖ రాశారు. ఈనెల 28న విచారణకు హాజరవుతానని అందులో పేర్కొన్నారు. అదే రోజు బండి సంజయ్‌తోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 28న బండి సంజయ్ సిట్ ఎదుట ఏం చెప్పబోతున్నారనే అంశంపై కొనసాగుతున్న చర్చ జరుగుతుండగా.. ఈ కేసుకు సంబంధించి కేంద్ర నిఘావర్గాల ద్వారా కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక సమాచారం, ఆధారాలు సేకరించినట్టు, వాటిని సిట్ ఎదుట సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం పట్ల బీజేపీ సీరియస్‌గా ఉంది. భార్యభర్తల బెడ్రూం మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ అధిష్ఠానం సైతం అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేతలు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కమలం పార్టీ నేతలు, కేంద్రమంత్రులు సీబీఐతో విచారణ చేయించాలని పట్టుబడుతున్నారు. బీజేపీ లీగల్ సెల్ సైతం హైకోర్టు లో కేసు వేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఐబీవర్గాలు ఆధారాలు సేకరిస్తున్నట్టు బీజేపీ నేతలు మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దాయన (కేసీఆర్) చెబితేనే.. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదు ట రాధాకిషన్‌రావు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్‌ల చుట్టూ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగిస్తున్నట్టు భావిస్తున్నారు.