24-06-2025 01:33:04 AM
బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని యత్నం
చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు.. 201 కి.మీ ట్రిపులార్‌కు క్యాబినెట్ ఆమోదం: మంత్రి పొంగులేటి
క్యాబినెట్ నిర్ణయాలు
* గోదావరి-బనకచర్లపై జూలై మొదటివారంలో సీఎల్పీ భేటీ
* నేడు సచివాలయం ఎదుట రైతు నేస్తం సభ
* తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం
* డిసెంబర్ 9న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
* తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందిం చేందుకు ఆమోదం
* 3 నెలలకోసారి క్యాబినెట్ స్టేటస్ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
* సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం.. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపా లిటీ అప్‌గ్రేడ్
* కొత్తగా ఏర్పాటు చేసే మున్సి పాలి టీలో 316 పోస్టుల భర్తీకి ఆమోదం
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి) : గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం వదులుకోదని స్పష్టం చేసింది. చట్టపరంగా, న్యాయపరంగా ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని క్యాబి నెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి కీలకమైన ప్రా జెక్టు అయిన రీజినల్ రింగ్ రోడ్డును చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల నిర్మాణానికి, నూతన క్రీడా పాలసీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రు లు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ కలిసి మీడియాతో మాట్లాడారు.
‘రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటే.. మేం పండుగ అని నిరూపించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటిలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ. 9వేల కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ర్టంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అం దించిన ఘనత మా ప్రభుత్వానిది. ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకో వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనున్నాం.
అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్దఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. తెలం గాణలో ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల్లో ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.
హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్ మెంట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఆర్ అండ్ బీ విభాగం తయారుచేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా క్యాబినెట్ పరిశీలించింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవు ఉండే అలైన్‌మెంట్‌కు తుది ఆమోదం తెలిపింది’ అని మంత్రి పొంగులేటి వివరించారు.
సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్ల తో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
బనకచర్లకు వ్యతిరేకించాలని నిర్ణయం..
‘తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని క్యాబినెట్ తీర్మానించింది.
రాష్ర్ట పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. గోదావరిబనకచర్లపై చర్చించేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి బేషిన్‌లో ఉన్న వాటర్‌ను పెన్నా నదిలోకి షిప్ట్ చేసే కార్యక్రమాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ఆమోదించినట్లు తెలిపారు. బనకచర్ల అనే బంకను ఈ ప్రభుత్వానికి రుద్దాలని బీఆర్‌ఎస్ నేతలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
డిసెంబర్ 9న తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ : పొన్నం
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వుజరీ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్ తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ రాష్ర్ట ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం ప్రకటించిన వికసిత్ భార త్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ర్టం లో మౌలిక సదుపాయల వృద్ధి తో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
దేశ ఎకానమీలో పదో వంతు సం పదను అందించే రాష్ర్టంగా వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్ రూపకల్పన చేయాలని కేబినెట్ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ మీటింగ్‌ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయం. ఆ మూడు నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను ఈ ప్రత్యేక భేటీలో సమర్పించి చర్చిస్తారు.
ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గం తో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సమావేశంలో పాల్గొంటారు’ అని వివరించారు. శాతవాహ న యూనివర్సిటికి అనుబంధంగా హుస్నాబాద్‌లోని కాలేజీలో నాలుగు కోర్సులకు గాను 240 సీట్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నోరి దత్తాత్రేయను క్యాన్సర్ వ్యాధి నివారణకు గాను తెలంగాణ అడ్వయిజర్‌గా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్‌ఎంజీ ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌తో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
పంచాయతీ ఎన్నికలపై చర్చ జరగలేదు..
పంచాయతీ ఎన్నికలపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో హియరింగ్ జరుగుతుండటంతో.. క్యాబినెట్‌లో చర్చ జరగలేదన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయం..
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ర్ట ప్రభుత్వానికి రాసిన లేఖపై క్యాబినెట్ చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను ఈనెల 30లోగా కమిషన్‌కు అందివ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించినట్లు పొంగులేటి పేర్కొన్నారు.
క్రీడా పాలసీకి ఆమోదం
రాష్ర్టంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని క్యాబినెట్ ఆమోదించిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ బోర్డు తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తుందని, జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్‌లో 10 శాతం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ర్ట స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.