17-07-2025 09:52:52 PM
వర్షం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రజలు
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): మదీనా మసీదు దుకాణాల ఆక్రమణదారులపై వక్ఫ్ బోర్డు ఉక్కుపాదం మోపారు. అగ్రిమెంట్ ప్రకారం అద్దె చెల్లించని 17 దుకాణ దారులకు వక్ఫ్ యాక్ట్ ప్రకారం అక్రమ ఆక్రమణదారులుగా ఎందుకు పరిగణించ కూడదో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ శాఖలైన రెవిన్యూ, వక్ఫ్ మరియు పొలిసు అధికారుల అధ్వర్యంలో గురువారం నోటీసులు జారీ చేశారు. వక్ఫ్ చట్టం ప్రకారం 2 నెలలు అద్దె చెల్లించనివారిని ఆక్రమణదారులుగా పరిగణించి డిమాండ్ ఎవిక్షన్ నోటీసులు జారీ చేయబడతాయి. గతేడాది సెప్టెంబర్ లోనే అద్దె చెల్లించనందుకు సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు జవాబు ఇవ్వని వారికి, అసలు అగ్రిమెంట్ లేని వారికి ఏవిక్షన్ నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వ మార్కెట్ వాల్యూయేషన్ సర్టిఫికెట్ ఆధారంగా అద్దె ధరలు రూ.18,000 - రూ.25,000 ఉండగా, మదీనా మసీదు దుకాణాల్లో అద్దె కేవలం రూ.4,000 – రూ.8,000 మాత్రమే నిర్ణయించారు. అయినా వాటినే చెల్లించకపోవడం దురుద్దేశ్యపూరితంగా భావించి చర్యలకు శ్రీకారం చుట్టారు. కొందరు ఒక్కొకరు 4,5 దుకాణాలు ఆక్రమించి ఇతర పేద ప్రజలకు అవకాశాలు దూరం చేస్తున్నట్టు,మరికొందరు మసీదుకు తక్కువ ధర చెల్లిస్తూ, మార్కెట్ ధరలతో సబ్ లీజుకు ఇచ్చుకుని వ్యాపారాలు చేస్తున్నట్టు విలేఖరులు కొందరు అప్పటి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ని ఆశ్రయించారు. ముఖ్యంగా 5 మంది వ్యాపారులు హరీస్, ఏసీ & కంప్యూటర్, టీ స్టాల్, మీసేవా, బ్యాటరీ వ్యాపారులు దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు.
వివిధ ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి వక్ఫ్ బోర్డుకు అప్పటి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ రిపోర్టు అందజేశారు. దాంతో వక్ఫ్ బోర్డు తన అధీనంలో స్థానికులతో కమిటీ ఏర్పాటు చేసి మసీదు నిర్వహణ మ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీ దుకాణదారులతో చర్చలు జరిపి నిర్ణయించిన నియమాలను మొదట అంగీకరిస్తూ అగ్రిమెంటు చేసుకుని తర్వాత కమిటీపై వ్యతిరేకత వచ్చింది. ఏళ్ల తరబడి అద్దె సవరణ జరగలేదని గ్రహించిన కమిటీ 100-150చ.అడుగులు ఉన్న మడిగలకు ₹3500- ₹4,000 లకు గాను , 180 - 200 చ.అడుగులు ఉన్న మడిగలకు ₹5,000 నుంచి ₹6,000 లకు గాను , 300+ చ.అడుగులు ఉన్న మడిగలకు ₹6,200 - ₹8,000 (ఒక్క దుకాణం) లకు గాను సవరణ చేశారు.సబ్ లీజు నిషేధం, ఒక్కరికి రెండు కంటే ఎక్కువ దుకాణాలు అనుమతి లేదని వక్ఫ్ యాక్ట్ ప్రకారం నిబంధనలు విధించింది.
తమ పంతం ఇక వక్ఫ్ కమిటీ ముందు చెల్లదని గ్రహించి జనవరి 2024 నుండి అమలవ్వాల్సిన అద్దె చెల్లింపులను సంపూర్ణ నిరాకరణ చేశారు. రాజకీయ అండదండలు ఉన్నాయని వక్ఫ్ బోర్డు కానీ, బోర్డు నియమించిన కమిటీ కానీ మమ్మల్ని ఏమీ చేయలేరని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. కమిటీ చెల్లదని హైకోర్టులో పిటిషన్,మూడు నెలలపాటు ఇరువైపుల వాదనలు విని కమిటీ నియామకం రాజ్యాంగబద్దమే అని తీర్పు వెల్లడిస్తూ ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. వక్ఫ్ బోర్డు సి.ఐ.ఓ. ఆధ్వర్యంలో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఫిబ్రవరి నెలలో అద్దె దారులను పిలిచి మార్కెట్ ధర ప్రకారం అసలు ఎంతవరకు చెల్లించగలరో చర్చించి నిర్ణయించాలని అద్దెదారులను పలుమార్లు చర్చలకు పిలిచినా రాకుండా లెక్క చేయని ధోరణిలో ఉన్నారు.
సరిపడా అద్దెలు లేకపోవడంతో మసీదు నిర్వహణకు తీవ్ర నష్టం జరిగింది. ఏడాది పాటు అధిక శాతం మసీదు ఖర్చులు కమిటీ సభ్యులే భరిస్తున్నారు. గత సంవత్సరం డిమాండ్ నోటీసుల తర్వాత సంతృప్తికరమైన వివరణ లేకపోవడంతో వక్ఫ్ బోర్డు తీవ్రంగా పరిగణించింది.15 రోజుల్లో దుకాణాలు ఖాళీ చేయకపోతే సీజ్ చేయవలసి వస్తుందని హెచ్చరించింది. ఖాళీ అయిన దుకాణాలను ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో ప్రజలకు లీజుకు ఇచ్చే ఆలోచనలో బోర్డు ఉంది. అర్హులైన పేద ముస్లింలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వక్ఫ్ జిల్లా అధికారులకు, కమిటీకి సూచనలు చేసింది. ప్రభుత్వ శాఖల కఠిన నిర్ణయాల పట్ల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.