17-07-2025 10:04:22 PM
గోదావరిఖనిలో సంస్థ హెచ్ఓడిని కలిసి విన్నవించిన కాంట్రాక్టర్స్
గోదావరిఖని,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన సివిల్ కాంట్రాక్ట్ మాన్యువల్ -2023 సవరణ పురోగతిపై సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం గోదావరిఖనికి వచ్చిన సంస్థ హెచ్ఓడి (సివిల్) వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. సంస్థవ్యాప్తంగా 11 డివిజన్లలో సీసీఎం సవరణలు చేయాలని గతంలో పలుమార్లు విన్నవించిన పట్టించుకోని కారణంగా న్యాయస్థానంలో కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. దాంతో గత మార్చి 26వ తేదీన సంస్థ సివిల్ జిఎం తమ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించగా 15 అంశాలను ప్రతిపాదించామని వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సివిల్ జిఎం హామీ ఇచ్చారని, ఆయన బదిలీ అనివార్యంతో సవరణ అంశం అలాగే ఉండిపోయిందని పేర్కొన్నారు.
ఆ పదిహేను అంశాలను బోర్డు ఆఫ్ డైరెక్టర్ కు నివేదిస్తామని, వాటికి సంబంధించిన నివేదికలు తమకు కూడా పంపిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు తమకు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొన్నారు. ఒకసారి ఆ అంశాలను పరిశీలించి సవరణలు జరిగేలా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సింగరేణిలో యూనిట్ రేట్ టెండర్లు అయినా హౌస్ కీపింగ్, సివిక్ పనుల నూతన రేట్ల పెంపుదల చేయాలని విన్నవించారు. ప్రస్తుతం మార్కెట్లో ముడి సరుకుల రేట్లు పెరిగిన దృష్ట్యా మాకు కూడా రేట్లు పెంచాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.