calender_icon.png 22 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెంబర్ 1 బ్యాటర్‌గా మిఛెల్

22-01-2026 01:06:33 AM

కోహ్లీ చేజారిన టాప్ ప్లేస్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

దుబాయి, జనవరి 21 : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. తాజాగా విడుదల చేసిన జాబితాలో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి నెంబర్ వన్‌గా నిలిచాడు. అతని ఖాతాలో 845 పాయింట్లు ఉండగా.. విరాట్ కోహ్లీ 795 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారిల్ మిచెల్ రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. మూడు మ్యాచ్‌లలో 176 యావరేజ్‌తో 352 పరుగులు చేశాడు. అతని అసాధారణ ప్రదర్శనతో 38 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ భారత గడ్డపై వన్డే సిరీస్ గెలిచింది.

ఈ సిరీస్‌లో కోహ్లీ ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ చేశాడు. అయితే రెండో వన్డేలో విఫలమయ్యాడు. దీంతో టాప్ ర్యాంక్ కోల్పోయాడు. సుదీర్ఘ విరామం తర్వాత నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న కోహ్లీ.. రోజుల వ్యవధిలోనే అగ్రస్థానాన్ని కోల్పోవడం అభిమానువను నిరాశపరిచింది. మరోవైపు ఈ సిరీస్‌లో నిరాశపరిచిన రోహిత్ శర్మ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 757 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ 764 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ 10, శ్రేయస్ అయ్యర్11వ స్థానంలో కొనసాగుతున్నారు. 

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తిలక్ వర్మ మూడో స్థానంలో నిలిచాడు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 880 పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అగ్రస్థానంలో ఉండగా.. యశస్వి జైస్వాల్ ఎనిమిది, గిల్ పదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నాడు.