calender_icon.png 22 January, 2026 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీఎల్ నిర్వహించేది టీసీఏనే

22-01-2026 01:04:14 AM

హెచ్‌సీఏకు అవకాశం లేదన్న గురువారెడ్డి

వివేక్ మంత్రి పదవికి రాజీనామా చేసి క్రికెట్ ఆడించుకోవచ్చు

హైదరాబాద్, జనవరి 21(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు యువ క్రికెటర్ల జీవితాలతో ఆడుకుంటోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సెక్రటరీ ధరం గురువారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించేది టీసీఏ మాత్రమేనని, టీ20 లీగ్ నిర్వహించే అధికారం హెచ్‌సీఏకు లేదని చెప్పారు. ఒకవేళ రూల్స్‌కు విరుధ్ధంగా హెచ్‌సీఏ తెలంగాణ టీ20 లీగ్ చేస్తే డిస్ క్వాలిఫై అవుతారని హెచ్చరించారు. మంత్రి వివేక్‌కు హెచ్‌సీఏతో ఏం పని ఉందని ప్రశ్నించారు. 

కావాలంటే వివేక్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి క్రికెట్ టోర్నీలు ఆడించుకోవచ్చని సూచించారు. బీసీసీఐ గుర్తింపు లేకుండా కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారన్నారు. దీనిలో ఆడిన క్రికెటర్లపై చర్యలు తీసుకునే అధికారం బీసీసీఐకి ఉంటుందన్నారు.  2018లోనే టీ20 లీగ్స్ నిర్వహించే అధికారం లేదని బీసీసీఐ స్పష్టంగా చెప్పినా హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదన్నారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌కు హెచ్‌సీఏ ఏం చేసిందని ప్రశ్నించారు.

తాము పదేళ్ళుగా సొంత డబ్బులతో టీసీఏ తరపున క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నామని, ఎంతో మంది యువ ఆటగాళ్ల టాలెంట్‌ను గుర్తించామన్నారు. ఇక గత కొన్నేళ్లుగా హెచ్‌సీఏపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హెచ్‌సీఏను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నవీన్ రావు ఈ మొత్తం వ్యవహారాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమానేశంలో టీసీఏ వైస్ ప్రెసిడెంట్ పి విజయ్ చందర్ రెడ్డి, అడ్వైసరీ మెంబర్ గోపాల్ శర్మ, టెక్నికల్ కమిటీ మెంబర్ చిత్తరంజన్, సోషల్ మీడియా ఇంఛార్జ్ వరుణ్ పాల్గొన్నారు.