22-01-2026 02:08:19 AM
మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): భూమి అమ్మకుండానే మేడారంలో కొందరు దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అదేమిటి.. భూములు అమ్మకుండా డబ్బులు సంపాదించడం ఏమిటి అని అనుకుంటున్నారా.. మేడారం జాతర సందర్భం గా మేడారం పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులు, గృహాల యజమానులు తమ భూములు, ఇండ్లను, ఖాళీ స్థలాలను అద్దెకు ఇస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు కోట్ల మంది భక్తులు రావడం జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రోజులపాటు మేడారంలోనే ఉండి వనదేవతలను దర్శించుకోవడం చాలామంది భక్తులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
దీనికి తోడు వేలాది మంది మేడారం జాతర సందర్భంగా వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి మేడారం వస్తున్నారు. వీరు వ్యాపారం నిర్వహించుకోవడానికి అవసరమైన స్థలాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే జాతర సందర్భంగా విడిది చేసే లక్షల మంది భక్తులు కూడా వసతి కోసం ఇండ్లు, ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించుకునే వారికి తక్కువలో తక్కువ గజానికి పదివేల రూపాయలు అద్దె తీసుకుంటుండగా, నివాసముండే వారికి వసతిని బట్టి పదివేల నుండి పాతిక వేలకు పైగా అద్దె వసూలు చేస్తున్నారు.
మేడారం, రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకల గుట్ట, జంపన్న బాబు, ఊరట్టమ్ స్తూపం, కన్నేపల్లి, కొత్తూరు, వెంగలాపూర్ తదితర ప్రాంతాల్లోని రైతులు తమ భూములను అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయానికి యాసంగి పంటలు పండించడానికి అనువుగా ఉన్న ప్రస్తుత తరుణంలో మేడారం జాతర నిర్వహణ సందర్భంగా పంటలు సాగు చేసుకునే పరిస్థితి ఉండదు. దీనికి బదులుగా తమ భూములను కొంత ఉచితంగా భక్తులు విడిది చేయడానికి వినియో గిస్తుండగా, రోడ్డుకు సమీపంలో ఉన్న భూమిని అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే మూడు రోజులపాటు కొంత, మరికొంతమంది నెలరోజుల పాటు వ్యాపారం నిర్వహించుకునేవారు అద్దెకు భూములను తీసుకోవడం వల్ల రైతులకు దండిగానే ఆదాయం లభిస్తుంది.
దీనితో మేడారంలో అద్దె గృహాలకు, భూములకు భలే డిమాండ్ ఏర్పడింది. ఇక మరికొందరు రైతుల నుంచి భూమి మొత్తం గుండు గుత్తగా అద్దెకు తీసుకొని, గుడారాలు వేసి రోజువారి అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నారు.