24-07-2025 01:16:08 AM
- విద్యార్థి విభాగం నేతల భేటీలో కేటీఆర్
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై విద్యార్థులు పోరాటం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం చెల్లదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా రాష్ర్ట ప్రభుత్వం పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుతున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నివాసంలో బుధవారం విద్యార్థి విభాగం నాయకులను కేటీఆర్ కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా బ్రష్టుపట్టించిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం 20 నెలల్లోనే విద్యారంగాన్ని పతన స్థితికి నెట్టిందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గాయపడిన విద్యార్థి నాయకుడు, మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ్‌తో కేటీఆర్ ఫోనులో మాట్లా డారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని నేతలను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు
తెలంగాణ భవన్‌లో బుధవారం సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం వస్తానని, బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో టీపీసీసీ మెంబర్ ఆర్షద్ హుసేన్, కౌటాల మాజీ ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ తదితరులున్నారు.